Annadatha Sukhibhava: నేడే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. రైతుల అకౌంట్లోకి ఒకేసారి ఎంతంటే..?
ఏపీలోని రైతులకు భారీ శుభవార్త. అన్నదాత సుఖీభవ నిధులు నేడు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు దీపావళి కానుకగా ముందే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంలో.. ఎలాంటి సభ లేకుండా నిధులు విడుదల చేయనున్నారు.

ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. అక్టోబర్ 30వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. సీఎం చంద్రబాబు ఈ నిధులను ఇవాళ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఏపీ రైతుల అకౌంట్లలో ఒకేసారి రూ.7 వేలు పడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిసి ఈ స్కీమ్‌ను ఏపీ సర్కార్ అమలు చేస్తోంది. దీంతో పీఎం కిసాన్ నగదు రిలీజ్ చేసే రోజునే అన్నదాత సుఖీభవ నిధులను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు నేడు జమ చేయనుండగా.. ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు రిలీజ్ చేయనుంది. దీంతో ఇవాళ ఏపీ రైతులకు ఈ రెండు పథకాల కింద రూ.7 వేలు అందనున్నాయి. అర్నబ్ తుఫాన్ క్రమంలో పంటకు నష్టం జరగడం, ఎల్‌నీవో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి తగ్గిన క్రమంలో రైతులకు ఈ ఆర్ధిక సాయం ఎంతో ఉపయోగపడనుంది.
నేేడే అకౌంట్లోకి డబ్బులు..
ఏపీలోని 46,85,838 మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ప్రత్యేక కార్యక్రమాలు, సభలు లేకుండా ఏపీ ప్రభుత్వం నిధులను అకౌంట్లలో వేయనుంది. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. అనంతరం శుక్రవారం జమ చేస్తున్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను జూన్ 20న చంద్రబాబు విడుదల చేశారు. ఇప్పుడు రెండో విడత నిధులు పంపిణీ చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలోని 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల ఆర్థిక సాయం అందించనుండగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు, కేంద్ర వాటా రూ.782.55 కోట్లుగా ఉంది.
పండక్కి ముందే రిలీజ్..
ఈ స్కీమ్ కింద ప్రభుత్వం రైతులకు ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో రూ.20 వేల ఆర్ధిక సాయం చేస్తోంది. వీటిల్లో ఏపీ ప్రభుత్వ వాటా రూ.14 వేలు, కేంద్ర వాటా రూ.6 వేలుగా ఉంది. గత ఏడాది ఆగస్టులో అన్నదాత సుఖీభవ పథకాన్ని కూటమి సర్కార్ ప్రారంభించింది. గత ఆర్ధిక సంవత్సరం 2025-26లో కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి రూ.8,895 కోట్లు రైతులకు అందించారు. ఈ రోజు విడుదల చేయనున్న నగదుతో కలిపి రూ.రూ.15,236.35 కోట్లు రైతులకు అందించినట్లు అవుతుంది. త్వరలో దీపావళి పండుగ రానుండటంతో.. ఆ పండక్కి ముందే రైతులకు నిధులు విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగానే పండక్కి ముందే విడుదల చేయనున్నాయి.
