Amaravati ORR : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై బిగ్ అప్‌డేట్
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని NHAI వేగవంతం చేసింది. మొత్తం 195.13 కి.మీ., 6-లేన్లుగా ORR నిర్మాణాం చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. రెండు ప్యాకేజీలుగా, BOT విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు NHAI పేర్కొంది. ఈ టెండర్ల దాఖలుకు 2027 జనవరి 15 తుది గడువు విధించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 195.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,116.45 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.
రెండు ప్యాకేజీలుగా ORR నిర్మాణం
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా చేపట్టేందుకు NHAI సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి ప్యాకేజీలో కంచికచర్ల నుంచి అగిరిపల్లి మీదుగా ఉయ్యూరు వరకు 87.63 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనుంది. ఈ పనులకు రూ.7,873.40 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇక రెండో ప్యాకేజీలో భాగంగా ఉయ్యూరు నుంచి గుంటూరు మీదుగా తిరిగి కంచికచర్ల వరకు 107.50 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్యాకేజీ నిర్మాణానికి రూ.7,243.05 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.
జనవరి 15 వరకు టెండర్ల దాఖలుకు అవకాశం
ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని BOT (టోల్ కమ్ యాన్యుటీ) విధానంలో చేపట్టనున్నారు. టెండర్ల దాఖలుకు 2027 జనవరి 15వ తేదీని చివరి గడువుగా NHAI నిర్ణయించింది. జనవరి 18న టెండర్లకు సంబంధించిన బిడ్లను తెరవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి చుట్టూ కీలకమైన రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
