Andhra Pradesh: రేపటి నుంచే అమలు.. ఇకపై డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు.. దేశంలోనే తొలిసారిగా..
Andhra Pradesh: పేపర్ లెస్ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్ లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ టేక్ అప్ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికి దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం..
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 3: ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ను మనం క్యారీ చేయక్కర్లేదు. పేపర్ డ్రైవింగ్ లైసెన్స్లు, పేపర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లకు ప్లాస్టిక్ కార్డులుండవు, అవసరం కూడా లేదు. పేపర్ లెస్ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్ లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ టేక్ అప్ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికి దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రపంచం డిజిటలైజేషన్ నేపధ్యంలో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ తో పాటు ఎం- పరివాహన్ అప్లికేషన్ లో ఇవి అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా రవాణా శాఖ దరఖాస్తు చేసుకున్న వారికి, ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులను సరఫరా చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో డ్రైవింగ్ లైసెన్స్, లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డుకు 200 రూపాయలు ఫీజు, 35 రూపాయల పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. శుక్రవారం నుంచి రవాణా శాఖ ఈ పాత విధానానికి ముగింపు పలికనుంది. మరోవైపు ఆ కార్డ్ ల కొరత వచ్చి ఏడాదిగా పెండింగ్ లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డుల ప్రింటింగ్ జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే 33.39 రూపాయల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం 200, పోస్టల్ చార్జీలకు 35 రూపాయలు వసూలు చేయరు.
డిజిటల్ కార్డులు ఎలా పనిచేస్తాయి
డిజి లాకర్ లేదా ఎం-పరివాహన్ అనే మొబైల్ అప్లికేషన్స్ లో వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ లు డిజిటల్ ఆర్సి కార్డులో జారి విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుందని వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయమని అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే సరిపోతుందని రాష్ట్ర రవాణా శాఖ భావిస్తోంది.
వాహనదారులకు సౌలభ్యం
తాజాగా రవాణా శాఖ లో తీసుకొచ్చిన డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఎం కే సిన్హా. దరఖాస్తు దారుల నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం ఆన్న సిన్హా అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలన్నారు.