AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC వాల్యుయేషన్‌లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!

ఆంధ్రప్రదేశ్‌లో 2025 మార్చిలో నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో వాల్యుయేషన్ లో తీవ్రమైన లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది. తొలిసారిగా, ఘోరమైన తప్పిదాలకు పాల్పడిన ఐదుగురు మూల్యాంకనాధికారులను (Evaluators) సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

SSC వాల్యుయేషన్‌లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
Ap Ssc Exam Valuation
Eswar Chennupalli
| Edited By: Balaraju Goud|

Updated on: May 30, 2025 | 9:34 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో 2025 మార్చిలో నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో వాల్యుయేషన్ లో తీవ్రమైన లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది. తొలిసారిగా, ఘోరమైన తప్పిదాలకు పాల్పడిన ఐదుగురు మూల్యాంకనాధికారులను (Evaluators) సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

రికార్డు స్థాయిలో RV/RC దరఖాస్తులు

ఈసారి SSC పరీక్షల ఫలితాలపై అనేక సందేహాలు తలెత్తడంతో విద్యార్థులు భారీగా రివాల్యుయేషన్ (Reverification), రీకౌంటింగ్ (Recounting) కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 66,363 స్క్రిప్టులపై దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 64,251 రీవాల్యుయేషన్, కాగా 2,112 రీకౌంటింగ్ దరఖాస్తులు ఉన్నాయనేది స్వయంగా విద్యాశాఖ విడుదల గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్క్రిప్టులలో 11,175 స్క్రిప్టుల్లో మార్కుల లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే సుమారుగా 18% తేడాలు తేలాయి. మిగతా 55,188 స్క్రిప్టుల్లో ఎటువంటి మార్పులు రాలేదు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఉదాహరణ మరింత కలకలం రేపింది. ఓ విద్యార్థిని అన్ని సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు సాధించగా, సోషల్ సబ్జెక్టులో కేవలం 23 మార్కులు రావడంతో ఆమె రీవాల్యుయేషన్‌ కు దరఖాస్తు చేసింది. రీవాల్యుయేషన్ ఫలితాలలో అదే సోషల్ సబ్జెక్టులో ఆమెకు 96 మార్కులు వచ్చాయి. ఆమె మొత్తం మార్కులు 575/600గా నమోదయ్యాయి. ఈ విషయం బయటకు రావడంతో, మిగతా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో రీవాల్యుయేషన్‌ కోసం ముందుకు వచ్చారు.

తేలిన లోపాలు – విధాన పరమైన వైఫల్యాలు

రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో గుర్తించిన లోపాలు:

టోటలింగ్ లోపాలు: మార్కుల మొత్తాన్ని తప్పుగా లెక్కించడం.

OMRలో మార్కుల నమోదు లోపం: స్క్రిప్ట్‌లో ఇచ్చిన మార్కులు OMR షీట్‌లో తప్పుగా మార్పిడి.

మార్కులు ఇవ్వకపోవడం: కొన్ని సరైన సమాధానాలకు మార్కులు ఇవ్వకపోవడం లేదా శూన్యంగా ఉండిపోవడం.

ఇన్ని లోపాలు ఉన్నా మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (AEs), స్పెషల్ అసిస్టెంట్లు (SAs), చీఫ్ ఎగ్జామినర్లు (CEs) – వాటిని గుర్తించడంలో విఫలమైంది. ఇది వ్యవస్థపై విశ్వాసాన్ని కుదిపేసింది.

RGUKT (IIIT) అడ్మిషన్ గడువు – విద్యార్థుల ఆవేదన

ఇంతలో RGUKT (IIIT) ప్రవేశాల దరఖాస్తు గడువు మే 20, 2025తో ముగిసింది. RV ఫలితాల వల్ల మార్కులు పెరిగిన అనేక మంది విద్యార్థులు తాజా మార్కులతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో, పాఠశాల విద్యాశాఖ RGUKT యాజమాన్యానికి జూన్ 5 నుండి 10 వరకు ప్రత్యేకంగా అప్లికేషన్ విండో ప్రారంభించాలన్న విజ్ఞప్తిని పంపింది. దీని వల్ల రీవాల్యుయేషన్‌ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులు కూడా IIIT ప్రవేశాలకు అప్లై చేయవచ్చు.

ముందస్తు చర్యలు – వ్యవస్థలో మార్పులపై దృష్టి

విద్యాశాఖ ఈ సందర్భాన్ని శిక్షణగా తీసుకుని, ముందుకు ఈ లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. 2026 నుండి నిర్వహించనున్న SSC పరీక్షలలో OMR డిజైన్ మార్చడం, మూడు స్థాయిల పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం, తప్పుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వంటి చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..