Andhra: కొత్త బార్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇవిగో పూర్తి వివరాలు
ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించింది. లైసెన్స్ ఫీజుల నుంచి షాపుల కేటాయింపు వరకు అన్ని రూల్స్‌లో సమూల మార్పులు చేసింది. కొత్త నిబంధనలతో సిండికేట్లకు చెక్ పెట్టబోతోంది. 28న లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ఉంటుంది. ఈ కథనంలో ఫుల్ డీటేల్స్ ...

మంగళగిరిలోని ఎక్పైజ్ శాఖ కమిషనరేట్ వేదికగా కొత్త బార్ పాలసీపై ఏపీ ఆబ్కారీశాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. ఏపీ వ్యాప్తంగా 840 బార్లు ఉండగా.. ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు నిశాంత్‌కుమార్ తెలిపారు. కొత్త వారూ మద్యం వ్యాపారంలోకి వచ్చేలా కొన్ని మార్పులు చేశామన్నారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలనే నిబంధన సడలించామని.. 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
ఇక.. లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. దానిలో భాగంగా.. 50 వేల లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు 55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే 75 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని నిశాంత్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఫీజులు పెంచుతామన్నారు. అలాగే.. గతంలో ఒకేసారి ఆగస్టులోపు లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉండేదని.. ఈసారి ఆరు సార్లు చెల్లించవచ్చని చెప్పారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని… ఇక.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని కేటగిరీల్లో దరఖాస్తు ఫీజు 5 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 28న కలెక్టర్ లాటరీ తీసి ట్రాన్స్‌పరెంట్‌గా బార్లు కేటాయిస్తారని.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్.




