Nara Lokesh: వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి.. విచారణకు హాజరైన రోజునే అరెస్టు చేస్తారా.. ఎన్నో అనుమానాలు..

కేసుల మీద కేసులు.. ఓ వైపు ఫైబర్‌ గ్రిడ్‌.. మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.. ఇలా టీడీపీ నేత నారా లోకేష్‌ను వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో సీఐడీ 41ఏ నోటీసును సవాల్‌ చేస్తూ నారా లోకేష్‌ వేసిన రెండు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఓ కేసులో ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో ఆరోజున లోకేష్‌ను సీఐడీ అరెస్ట్‌ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Nara Lokesh: వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి.. విచారణకు హాజరైన రోజునే అరెస్టు చేస్తారా.. ఎన్నో అనుమానాలు..
Nara Lokesh
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 03, 2023 | 9:36 PM

అమరావతి, అక్టోబర్ 03: అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల సమయం ఉండగానే ఏపీ రాజకీయాలు పీక్‌ స్టేజ్‌కు చేరాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కేసుల రగడ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయి.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అదే సమయంలో.. నారా లోకేష్‌కు సంబంధించిన కేసుల్లోనూ సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆయనపై ఉన్న ఫైబర్‌గ్రిడ్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసుల్లో విచారించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

దాంతో.. ఫైబర్‌ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. హైకోర్టులో విచారణ జరిగింది. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణలో లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. లోకేష్‌ను ఇంతవరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒకవేళ చేరిస్తే ఆయనకు సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని చెప్పారు. దాంతో.. 41ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామన్నారు లోకేష్‌ తరపు న్యాయవాది. ఇరువర్గాల వాదనల అనంతరం.. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

హైకోర్టులో లోకేష్ సవాల్ చేయగా..

మరోవైపు.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో సవాల్ చేశారు నారా లోకేష్. దానిపై విచారించిన హైకోర్టు.. కేసును ఈ నెల 10కి వాయిదా వేసింది. సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులను హైకోర్టులో లోకేష్ సవాల్ చేయగా.. విచారణ సందర్భంగా.. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. అక్టోబరు 10న సీఐడీ విచారణకు లోకేశ్‌ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

బుధవారం విచారణకు రావాలని..

ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని ఆదేశించింది. న్యాయవాదిని అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి.. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేశ్‌కు సీఐడీ నోటీసు ఇవ్వగా.. హైకోర్టు ఆదేశాలతో 10వ తేదీవరకూ అరెస్టు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తంగా.. ఓ వైపు చంద్రబాబు అరెస్ట్‌.. మరోవైపు నారా లోకేష్‌పై వరుస కేసులు టీడీపీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి