AP News: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపునకు సర్కార్ కసరత్తు.! త్వరలోనే కీలక నిర్ణయం

ఏపీలో భూముల విలువ త్వరలో పెరగనుంది. కనిష్ఠంగా 10శాతం, గరిష్ఠంగా 20శాతం వరకు వాల్యూ పెరిగే అవకాశం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు చేశారు.

AP News: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపునకు సర్కార్ కసరత్తు.! త్వరలోనే కీలక నిర్ణయం
Ap News
Follow us

|

Updated on: Aug 10, 2024 | 7:15 AM

ఏపీలో భూముల విలువ పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇందుకోసం శాస్త్రీయ అధ్యయనానికి 45 రోజుల గడువు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత.. పెంపు ప్రతిపాదనలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిని కూడా సరిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో శాస్త్రీయత లేకుండా రిజిస్ట్రేషన్ విలువని పెంచారని, దాన్ని సరిదిద్దడంతో పాటు ఇటీవల కాలంలో భూముల రేట్లు పెరిగిన కొన్ని ప్రాంతాలలో మరికొంత పెంచాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది.

గత ప్రభుత్వ హయాంలో 2019లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో, 2020లో ఎంపిక చేసిన పట్టణాల్లో 10 నుంచి 20శాతం భూముల వాల్యూ పెంచారు. 2022లో జిల్లా కేంద్రాల్లో 20శాతం, 2023లో జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న భూములుతో పాటు, ఎంపిక చేసిన ప్రదేశాల్లో 20శాతం వరకు భూముల విలువ పెంచారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలతో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ధరని నిర్ధారించాలని సర్కార్ భావిస్తుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ విలువ చాలా ఎక్కువగా పెంచేశారు. వాటిని అమ్ముకునేందుకు భూ యజమానులు ప్రయత్నించినా ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయి.. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుంది. ఇలాంటి ఇబ్బందులున్న చోట వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ వాల్యూని సరిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, విధానాల విషయంలోనూ మార్పులు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధానాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను యధావిధిగా ఉంచుతూ, క్రయ, విక్రయదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది. మౌలిక సదుపాయాల కోసం 10 కోట్లు అవసరమని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ప్రతిపాదించగా వాటి విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం, వీటివల్ల అదనంగా ఖర్చు, సిబ్బంది వృథాతోపాటు అనేక టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అధికారుల సూచనలతో ఈ పద్దతిని కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడంతోపాటు ఎక్కువ సిబ్బంది, అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉన్న వనరులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..