Ration Cards: రేషన్‌కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. ఉచితంగా మరో రెండు సరుకులు.. ఈ నెల నుంచే అమలు..
ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. రేషన్ సరఫరాలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. పేదలకు ఉచితంగా బియ్యంతో పాటు అనేక నిత్యావసర సరుకులు అందిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh News: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పంచదార, గోధుములు వంటి ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. తాజాగా వీటిల్లో మరో రెండింటిని ప్రభుత్వం కలిపింది. ఇక నుంచి రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు కూడా ఉచితంగా అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మొన్నటివరకు రాయలసీమ జిల్లాల ప్రజలకు మాత్రమే వీటిని ఫ్రీగా అందించారు. ఇకపై ఉత్తర కొస్తా జిల్లాల్లో కూడా దీనిని అమలు చేయనున్నారు. ఈ నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఏప్రిల్ నుంచి రాయలసీమ జిల్లాల్లో రేషన్‌కార్డు లబ్దిదారులకు బియ్యం,పంచదారతో పాటుగా జొన్నలు, రాగులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ నెల నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, మన్యం అనకాపల్లి, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ప్రజలకు కూడా ఇవ్వనున్నారు. త్వరలో మిగిలిన జిల్లాల ప్రజలకు కూడా ఇది వర్తింపచేసే అవకాశముంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ అమలు చేయనున్నారు. ఆరోగ్య రీత్యా అనేక ప్రయోజనాలు ఉండటంతో రాగులు, జొన్నల వినియోగం పెరిగిపోయింది. దీంతో వీటిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న ప్రతీవ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే అందులో కొంత బియ్యానికి బదులుగా రాగులు, జొన్నలు అందించనున్నారు. అంటే 20 కేజీల బియ్యంలో 2 కేజీల జొన్నలు, రాగులు పంపిణీ చేస్తారు. మిగతా 18 కేజీల బియ్యం అందిస్తారు. గతంలో ఎఫ్‌సీఐ రాష్ట్రానికి సరిపోయేంత రాగులు, జొన్నలు సరఫరా చేసింది. కానీ ఇప్పుడు సరఫరా చేయడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వమే వాటిని సేకరించి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు ఫ్రీగా పంపిణీ చేస్తోంది. బయట దుకాణాల్లో జొన్నలు, రాగులు కొనాలంటే పేదలకు చాలా ఖర్చవుతుంది. అదే ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అందించడం శుభపరిణామంగా చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల్లో అనేక మార్పులు చేసింది. ఇంటి వద్దకే సరుకులు తెచ్చి ఇచ్చే రేషన్ వాహనాలను తొలగించిన ప్రభుత్వం.. ఆ తర్వాత స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది. అలాగే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తోంది. ఇప్పటికే అనేకమందికి కొత్త రేషన్ కార్డులు పొందారు.
