AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: రెండు పెళ్లిళ్లు.. అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..

నేటి సమాజంలో మోసగాళ్ళకు కొదవ లేకుండా పోతుంది. అవతల వ్యక్తి అత్యాశ మోసగాళ్ళకు వరం లాగా మారుతోంది. దీంతో మాయమాటలు చెప్పి నమ్మిన వాళ్ళను నట్టేట ముంచేస్తున్నారు ఈ మాయగాళ్లు. తాజాగా ఇలాంటి మోసగాడినే పట్టుకొని అరెస్ట్ చేశారు శ్రీకాకుళం రూరల్ పోలీసులు..

Andhra: రెండు పెళ్లిళ్లు.. అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..
Srikakulam Fruad Case
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Mar 11, 2026 | 12:32 PM

Share

వివిధ ప్రాంతాల్లో నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు స్థలాలు కొనిపెడతానని నమ్మబలికి కోట్ల రూపాయలు మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఓవ్వేరు గ్రామంకి చెందిన గొల్ల బెనర్జీ అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి (33) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శ్రీకాకుళం జిల్లా, నందిగం మండలం నరిసిపురం గ్రామంకి చెందిన దేశెట్టి రమణమూర్తి (46), తండ్రి అప్పలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు. తనను గోల్ల బెనర్జీ అనే వ్యక్తి సుమారు రూ.1 కోటి 5 లక్షల వరకు మోసం చేసినట్లు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో దేశెట్టి రమణమూర్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును సీఐడీ విశాఖపట్నం అధికారులు విచారించి తమ ఎంక్వైరీ రిపోర్టును సీఐడీ డీజీ కి పంపించారు. అనంతరం డీజీ సీఐడీ తదుపరి చర్యల కోసం ఆ ఫిర్యాదును శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డికి పంపించారు. దాని ప్రకారం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, శ్రీకాకుళం రూరల్ ఇన్స్పెక్టర్ కె. పైడపునాయుడు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మార్చి 10 న మధ్యాహ్నం సుమారు 1.00 గంటల సమయంలో నిందితుడు గోల్ల బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంటర్ వరకు చదివి, తరువాత సీఏ కోర్సులో చేరి మధ్యలోనే మానేసి అకౌంట్స్ పై కొంత పరిజ్ఞానం సంపాదించాడు బెనర్జీ. మొదట నెల్లూరులో సురేఖ అనే మహిళను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత ఆమెను విడిచిపెట్టాడు. అనంతరం శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ గ్రామానికి చెందిన అంబటి నాగమణిని వివాహం చేసుకుని అరసవెల్లిలో నివసించడం ప్రారంభించాడు. అక్కడ తన ఇంటి యజమాని దేశెట్టి రమణమూర్తితో పరిచయం పెంచుకుని, తాను ఢిల్లీలో సెంట్రల్ జోనల్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని, ఇటీవల విశాఖపట్నం రీజియన్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యానని అబద్ధం చెప్పాడు. అలాగే తాను పలు బ్యాంకుల రిక్రూట్మెంట్ బోర్డులో మెంబర్‌నని చెప్పి ఎస్‌బీఐ బ్యాంకులో బ్యాక్లాగ్ పోస్టుల కింద పి.ఓలు, క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒక్కో ఉద్యోగానికి రూ.6 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కడితే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు.

ఈ విధంగా చుట్టుపక్కల వ్యక్తుల నుండి సుమారు రూ.36 లక్షలు వసూలు చేసి వారికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు ఇచ్చాడు. అంతేకాకుండా శ్రీకాకుళం చిన్నబజార్ రోడ్‌లో 8 సెంట్ల స్థలం ఆక్షన్‌కు వస్తుందని, తన పరిచయాలతో తక్కువ ధరకు ఇప్పిస్తానని రమణ మూర్తిని నమ్మబలికి సుమారు రూ.86 లక్షలు తీసుకున్నాడు. ఇంకా రూ.29 లక్షల విలువ గల గోల్డ్ క్రాఫ్ట్ మెషీన్‌ను రూ.14 లక్షలకే ఇప్పిస్తానని చెప్పి కూడా డబ్బులు తీసుకుని ఎటువంటి వస్తువు ఇవ్వకుండా మోసం చేశాడు. శ్రీకాకుళం జిల్లాలో తన మోసం బయటపడటంతో నిందితుడు విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేశాడు. విశాఖపట్నంలో 8 మందిని, తిరుపతిలో ముగ్గురిని, అలాగే నెల్లూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో కూడా పలువురిని మోసం చేసి గత మూడు ఏళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.

నిందితుడిపై నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌లో రెండు చీటింగ్ కేసులు, ఒక కొట్లాట కేసు, ఏ.ఎస్.పేట పోలీస్ స్టేషన్‌లో ఒక చీటింగ్ కేసు, అలాగే తాడేపల్లిగూడెం మరియు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో మరో చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ అంతరాష్ట్ర నిందితుడిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళం రూరల్ ఇన్స్పెక్టర్ కె. పైడపునాయుడు, సబ్-ఇన్స్పెక్టర్ కె. రాము అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలు మేరకు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us