Vizag: శ్వేత మృతికేసులో కీలకంగా మారనున్న పోస్టుమార్టం రిపోర్టు.. పోలీసుల అదుపులో ఆ ఐదుగురు!

వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత గురువెల్లి శ్వేత (24) మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వైద్యులు గురువారం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శవ పంచనామ నిర్వహించారు. కేజీహెచ్‌ శవాగారంలో ముగ్గురు వైద్యుల బృందం శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం..

Vizag: శ్వేత మృతికేసులో కీలకంగా మారనున్న పోస్టుమార్టం రిపోర్టు.. పోలీసుల అదుపులో ఆ ఐదుగురు!
Vizag RK Beach Pregnant woman died case
Follow us

|

Updated on: Apr 28, 2023 | 10:20 AM

వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత గురువెల్లి శ్వేత (24) మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వైద్యులు గురువారం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శవ పంచనామ నిర్వహించారు. కేజీహెచ్‌ శవాగారంలో ముగ్గురు వైద్యుల బృందం శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. పోస్టుమార్టం అనంతరం శ్వేత మృతదేహాన్ని తల్లి రమ, బంధువులకు పోలీసులు అప్పగించారు. గురువారం శ్వేత మృతదేహానికి కాన్వెంట్‌ కూడలి సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రస్తుతం పోలీసుల చేతుల్లో ఉన్న నివేదికల్లో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు శ్వేత మృతిని తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ, అనుమానాస్పద మృతిగా మూడో పట్టణ పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా 5 నెలల గర్భిణి అయిన శ్వేత మృతిలో మరో కీలకమైన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు శ్వేత ఆడపడుచు భర్త సత్యం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె తల్లి రమ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆడపడుచు భర్త సత్యంపై లైంగిక వేధింపులు, అత్త-మామలు,ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్వేత మృతి కేసులో భర్త, అత్త-మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్తతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు శ్వేత ఇంటి నుంచి ఎటువైపు వెళ్లిందనేదానిపై సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్వేత మృతదేహం లభ్యమైన బీచ్‌ రోడ్డులోని పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. బీచ్‌ రోడ్డులో ఇలా నిఘా కళ్లు పనిచేయకపోవడంతో శ్వేత ఏ సమయంలో ఎక్కడ ఉందనే అంశాలపై పోలీసులకు స్పష్టత కరువైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.