AP CM Jagan: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. విజయవాడకు తిరుగు పయనం.. రెండు రోజుల్లో ఆరుగురు మంత్రులతో భేటీ!
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన ముగిసింది. మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీ అయ్యారు.
AP CM Jagan Delhi tour ends: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన ముగిసింది. మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీ అయ్యారు. పైగా నిన్న రాత్రి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షాతో డిన్నర్ మీటింగ్ జరగడం ఈ టూర్‌లోనే హైలెట్.
ఢిల్లీ టూర్‌లో రెండు రోజూ బిజీబిజీగా ఉన్నారు ఏపీ సీఎం జగన్.. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వస్తారు. కొద్దిసేపటి కిందటే పియూష్ గోయాల్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించారు. నిన్న జవదేకర్, షెకావత్, నీతి ఆయోగ్ చైర్మన్, అమిత్‌షాతో భేటీ అయ్యారు జగన్.
ఏపీ అభివృద్ధి, రాష్ర్ట వికేంద్రీకరణ, ప్రాజెక్ట్‌లు, విభజన హామీలతో పాటు పలు అంశాలపై ఏపీ సీఎం జగన్ నిన్న పలువురు కేంద్ర మంత్రులతో చర్చించారు. రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీకి చేరిన ఆయన…రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గంటన్నరసేపు చర్చించారు. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్‌లతో కూడాసమావేశమయ్యారు. ఇవాళ దేశ ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయిన జగన్… 11 గంటలకు పీయూష్‌ఘోయల్‌ని కలుసుకున్నారు.
నిన్న జరిగిన సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా సహా పలు విభజన హామీలు, వైద్య కళాశాలలకు అనుమతులపై మంత్రులతో వేర్వేరు సమావేశాల్లో చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలో రాత్రి9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమై, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యంతో కూడిన అభివృద్ధికి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదిస్తూ ప్రణాళిక రూపొందించామన్నారు. ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చామన్నారు. కర్నూలులో హైకోర్టు స్థాపనకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు జగన్. రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్న జగన్.. కేంద్రం పెండింగ్‌లో ఉన్న కాలేజీలకూ అనుమతులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఏపీకి సహాయం చేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ చెప్పిందన్నారు.
కేంద్ర పెట్రోలియం అండ్ స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి. ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కోరారు. వాటిపైనే ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ చర్చించినట్లు తెలుస్తోంది.
చివరిగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.