Balineni: రోజంతా సాగిన హైడ్రామా.. సీఎం చెప్పిన చిన్న ముచ్చటతో.. అలక వీడిన బాలినేని!

రోజంతా సాగిన హైడ్రామాకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెరదించారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు.

Balineni: రోజంతా సాగిన హైడ్రామా.. సీఎం చెప్పిన చిన్న ముచ్చటతో.. అలక వీడిన బాలినేని!
Balineni Srinivas Reddy
Follow us

|

Updated on: Apr 11, 2022 | 8:36 PM

Balineni Srinivas Reddy: రోజంతా సాగిన హైడ్రామాకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెరదించారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. మంత్రి పదవి కోసం పాకులాడే వ్యక్తిని కానని అన్నారు. YS కుటుంబానికి తాను ఎప్పుడు విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. పదవి పోయినప్పుడు కొంత బాధ ఉండటం సహజమని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని జరిగిన ప్రచారమంతా అవాస్తవమని బాలినేని కొట్టిపారేశారు. తనకు మద్దతుగా రాజీనామాలు చేసిన అందరూ నాయకులు వాటిని వెనక్కి తీసుకుంటారనని బాలినేని తెలిపారు.

అంతకు ముందు మాజీ మంత్రి బాలినేని ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలుమార్లు కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దీంతో బాలినేనిని… సీఎం తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదనే విషయంపై బాలినేనికి సీఎం జగన్‌ వివరించారు. కొత్త కేబినెట్‌లో ఐదు నుంచి ఆరుగురు పాత మంత్రులను మాత్రమే కొనసాగించాలని అనుకున్నామని… అయితే చివరి నిమిషంలో సమీకరణాల నేపథ్యంలో కొంతమంది సీనియర్లకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్లు జగన్‌ చెప్పినట్లు సమాచారం. మంత్రి పదవి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తులో పార్టీ మరోసారి అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని బాలినేనికి సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి దూరంగా వెళ్లాలనే ఆలోచనలు మానేసి అందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా బాలినేనిని సీఎం జగన్‌ బుజ్జగించినట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం బాలినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకు ఎటువంటి విభేధాలు లేవని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏనాడు ఆయన జిల్లా పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కొత్త కేబినెట్‌కు పార్టీ శ్రేణులు సపోర్టు చేయాల్సిన అవసరం ఉందని బాలినేని అన్నారు.

ఇదిలావుంటే, కొత్త మంత్రివర్గంలో 11 మంది పాతవారు, 14 మంది కొత్త మంత్రులు ఉన్నారు. ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం జరిగింది. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తానని బాలినేని స్పష్టం చేశారు. జగన్‌ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడానికి కృషి చేస్తానని బాలినేని పేర్కొన్నారు.