Vontimitta: వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం.. సంజీవని తెచ్చిన సంజీవరాయడు విశిష్టత ఏమిటంటే..
Vontimitta Brahmotsavam: కడప జిల్లా(Kadapa District) ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి(Sri Kodandarama Swami) బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో..
Vontimitta Brahmotsavam: కడప జిల్లా(Kadapa District) ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి(Sri Kodandarama Swami) బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో(Venuganalankaram) స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి సంజీవరాయడుగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
సంజీవరాయని ఆలయ పురాణ ప్రాశస్త్యం: ఒంటిమిట్ట గుడిలో సీతాలక్ష్మణులు ఇరువైపులా ఉండగా కోదండం ధరించి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. ఇది అరణ్యవాస కాలం నాటి దృశ్యం. అప్పటికి ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం హనుమంతునికి కాలేదు. ఆ కారణం చేతనే ఒంటిమిట్ట గుడిలో ఆంజనేయస్వామి లేడంటారు. ఇక్కడ రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటును కావున ఎదురుగా ఉండి సేవ చేసుకుంటానని ఆంజనేయస్వామి చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఒంటిమిట్ట గుడికి ఎదురుగా సంజీవరాయడుగా కొలువుదీరి ఉన్నాడు. రామరావణ యుద్ధంలో వానరులు మరణించినపుడు, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రెండుసార్లు హిమాలయ పర్వతాలు దాటి మహేంద్రగిరికి వెళ్లి నాలుగు రకాల సంజీవని మూలికలను ఆంజనేయుడు తెచ్చినట్టు పురాణ కథనం. కావున ఇక్కడిస్వామివారికి సంజీవరాయడని పేరు వచ్చింది.
చెరువు కట్ట మీద కూడా ఆంజనేయస్వామివారు కొలువై ఉన్నారు. నీటి వల్లగానీ, వరిపొలంలో తిరుగుతున్నపుడు గానీ, ఈ బాటలో యాత్ర చేస్తున్నప్పుడు గానీ ప్రాణభయం కలగకుండా ఈ ఆంజనేయస్వామి కాపాడతారని భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామివారు శారీరక మానసిక రోగాలు పోగొడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.