CM YS Jagan: పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఉద్యోగులను తొలగించేదీలేదు.. రెండేళ్లలో అన్ని స్కూళ్లల్లో మౌలిక సౌకర్యాలు పూర్తిః సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని.. ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
AP CM YS Jagan Clarity on new Education Policy: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని.. ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ, నూతన విద్యా విధానం, అంగన్‌వాడీల్లో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చే క్రమంలో జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలోనే రెండేళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, ప్రస్తుత, భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
నూతన విద్యా విధానంలో భాగంగా మండలానికి ఒకట్రెండు జూనియర్ కళాశాలలు ఉండేలా చూడాలని.. ఆట స్థలం లేని పాఠశాలలకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి క్రీడా దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఉద్యోగులను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పీపీ-1లో 1, 2 తరగతులకు కిలోమీటర్ లోపు పాఠశాల ఉండాలన్నారు. పీపీ-2లో 3-10 తరగతులకు 3 కిలోమీటర్లలోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఒకే టీచర్ అన్ని పాఠ్యాంశాలు బోధించే విధానం సరైంది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. అవసరమైనచోట్ల ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని సూచించారు. జులై 1నుంచి రెండో దశ నాడు-నేడు ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.