TDP: తెలంగాణ వైపు టీడీపీ చూపు.. పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు ఫోకస్
తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలంగాణలో యాక్టీవ్ కానుందా?.. ఎక్కడి నుంచి పునః ప్రారంభం కాబోతోంది?. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలు ఏంటి?.. పొలిట్ బ్యూరో సమావేశంలో ఏం చర్చించారు?.
దశాబ్దకాలంగా.. తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఇకపై తెలంగాణ గడ్డపై కూడా ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. అమరావతి వేదికగా జరిగిన.. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణలో ఇప్పటికీ పదిశాతానికి పైగా ఓటు బ్యాంక్ టీడీపీకి ఉండటంతో.. పార్టీని యాక్టీవ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోనూ టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని తీర్మానించారు.
ఒకవేళ టీడీపీ అధినేత తెలంగాణపై ఫోకస్ పెడితే.. ఎక్కడి నుంచి రంగంలోకి దిగుతారనేది సస్పెన్స్‌గా మారింది. గ్రామస్థాయిలో టీడీపీకి చెందిన కేడర్ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్‌వైపు మళ్లడంతో.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. దీంతో.. ఇతర పార్టీల్లో చేరిన వాళ్లంతా తిరిగి సొంత గూటికి వస్తే.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గ్రామస్థాయిలో పార్టీ కేడర్ అంతా చీలిపోవడంతో.. మున్సిపల్, జెడ్పీ ఎన్నికల్లో పోటీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలోనూ టీడీపీ బాస్ ఉన్నారు.
తెలంగాణలో టీడీపీ బలోపేతానికి ముందు రాష్ట్రస్థాయిలో అధ్యక్షుడు, కార్యవర్గం.. బలమైన నేతలు అవసరం. రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ అధ్యక్షులుగా ఎల్ రమణను నియమించారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరడంతో.. కాసాని జ్ఞానేశ్వర్‌ను అధ్యక్షుడ్ని చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయని కారణంగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాసాని కూడా బీఆర్ఎస్‌లో చేరారు. దాంతో.. తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమించారు. ప్రస్తుతం ఆయన తాత్కలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
జాతీయ పార్టీగా మరింతగా దేశంలో ఎక్స్ పోజ్ కావాలంటే.. తెలంగాణలోనూ టీడీపీ కీలక రోల్ పోషించాల్సిందేనని.. ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పూర్వవైభవం కోసం.. ముందు నుంచి ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు.. గ్రామస్థాయిలో పసుపుజెండా మోసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు చంద్రబాబు. అవసరమైతే.. ఏపీలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి.. వారి ద్వారా ఇక్కడ టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. ఏపీలో అధికారం చేపట్టాక.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు.. ఇక్కడి నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టీడీపీకి పూర్వవైభవం కోసం.. పార్టీ అధ్యక్షుడు, సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిన్నటి సమావేశంలో.. పొలిట్‌బ్యూరో కూడా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మొగ్గు చూపడంతో.. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. సో మొత్తానికి.. దశాబ్దకాలంగా తెలంగాణలో.. స్తబ్దుగా ఉన్న టీడీపీ మళ్లీ యాక్టీవేట్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..