ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 ఏప్రిల్ 18వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొననున్నారు. ఫలితాలను ఆలస్యం చేయకుండా మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పదోతరగతి పరీక్షా కేంద్రాలను గురువారం (ఏప్రిల్ 13) ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని అన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. వాల్యుయేషన్ పూర్తైన తర్వాత ఇతర ప్రొసీడింగ్స్ కూడా త్వరితగతిన పూర్తి చేసి మే రెండో వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు డైరెక్టర్ డి దేవానందరెడ్డి చెప్పారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.