Cyclone Bay of Bengal: విశాఖకు ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!
ఇప్పటికే తౌక్టే తుఫాను ధాటికి భారతావని వణికిపోతుంటే.. మరో ముప్పు పొంచి ఉంది. ఈనెల 22 తేదీన తూర్పు తీర ప్రాంతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశమందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Cyclone form over Bay of Bengal: ఇప్పటికే తౌక్టే తుఫాను ధాటికి భారతావని వణికిపోతుంటే.. మరో ముప్పు పొంచి ఉంది. ఈనెల 22 తేదీన తూర్పు తీర ప్రాంతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశమందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీనికి యాస్ తుఫానుగా నామకరణం చేశారు అధికారులు.
తౌక్టే తుపాను ధాటికి దేశ పశ్చిమ తీర రాష్ట్రాల్లో సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే.. మరో ముప్పు మూసుకువస్తోంది. మే 26-27 తేదీల్లో మరో తుఫాను తూర్పు తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ నెల 22న ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇటు ఆంధప్రదేశ్ తీర ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.
‘‘అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. అది వాయువ్య దిశగా కదులుతూ మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను తాకే అవకాశముంది’’ ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం వెల్లడించింది. తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, బెంగాల్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
సాధారణంగా రుతుపవనాల ఆగమనానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపానులు ఏర్పడుతుంటాయి. గతేడాది మే నెలలో అంఫన్, నిసర్గ తుపానులు తీర రాష్ట్రాల్లో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పశ్చిమాన తౌక్టే తుపాను విరుచుకుపడింది. తౌక్టే ధాటికి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలకు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముంబయి తీరంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి.
Read Also… Southwest Monsoon : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్… ముందే పలకరించనున్న నైరుతి..