ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్లి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కాకినాడ నుండి కర్నూల్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ సమీపంలో ఓ లారీని ఢీ కొట్టింది. బస్సు అదుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బస్సులో ప్రయాణిస్తు్న్న 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. జేసీపీ సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.