Privilege Committee: టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు రంగం సిద్దం.. అసెంబ్లీ సమావేశాల్లో మైక్ కట్..!
Privilege Committee: ఏపీ సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషించారన్న కారణంతో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు ఈ అసెంబ్లీలో సమావేశాల్లో మైక్ ఇవ్వకూడదని నిర్ణయం..
Privilege Committee Meeting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారన్న కారణంతో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు ఈ అసెంబ్లీలో సమావేశాలు జరిగినన్ని రోజులూ మైక్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. శాసనసభను తప్పుదోవ పట్టించారన్న ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు సభకు ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయనుంది. మంగళవారం ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకంది. అయితే, ఈ ప్రతిపాదనలను ప్రివిలైజ్ కమిటీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆయన మాట్లాడుతూ రామానాయుడిని సీఎం డ్రామా నాయుడు అంటేనే తిరిగి రామానాయుడు మాట్లాడారని గుర్తు చేశారు. కావాలంటే రికార్డులను పరిశీలించుకోవాలని సూచించారు. అచ్చెన్నాయుడు, రామానాయుడికి అసెంబ్లీ సమావేశాల్లో మైక్ ఇవ్వకూడదనే తీర్మానాన్ని ప్రివిలైజ్ కమిటీ.. స్పీకర్‌కు పంపింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖను కమిటీ పరిశీలించింది. అలాగే కూన రవికుమార్ లేఖను కూడా పరిశీలించారు.
మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పుదోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ నిర్దారిచింది. ఈ క్రమంలో స్పీకరును దూషించారనే ఫిర్యాదులో అచ్చెన్నాయుడు క్షమాపణలను కమిటీ పరిగణనలోకి తీసుకుని క్షమించి వదిలేసిందని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అచ్చెన్న, నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్న, నిమ్మలపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇస్తామన్నారు. అలాగే, నోటీసులు తీసుకునే విషయంలో కూన రవి విషయంలో ఆధారాలు సమర్పించమని కోరామన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకొచిృన ఆధారాల పరిశీలన అనంతరం కూన రవి కుమార్‌పై చర్యలు తీసుకుంటామని కాకాని స్పష్టం చేశారు.
అలాగే, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై వచ్చి ఫిర్యాదు విషయంలో మరింత సమాచారాన్ని కోరారు.. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక పంపాలని ఆదేశించామని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూడదనేం లేదన్నారు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోయిండొచ్చని కాకాని అభిప్రాయపడ్డారు.