AP: పోలీసుల తనిఖీలు.. కారు లోపల అంతా ఖాళీ.. కానీ డోర్లలోనే ఉంది అసలు మేటర్
ఈ మధ్య కాలంలో వచ్చిన పుష్ప సినిమాలో.. సరికొత్త పద్ధతుల్లో ఎర్రచందనం ఎలా సరఫరా చేయాలో చూపించారు. అంతకుమించిన రేంజ్‌లో ఇప్పుడు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.
Paderu: పుష్ప సినిమా(Pushpa Movie) చూసి వీరు ఇన్‌స్పైర్ అయ్యారో, లేదా వీరి నుంచే పుష్ప సినిమా డైరెక్టర్ అయ్యారో తెలియని పరిస్థితి. స్మగ్లింగ్‌లో రోజుకో సరికొత్త స్టైల్ ను ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఆ సినిమాలో ఎర్రచందనం తరలించేందుకు ఎన్ని అడ్డమైన మార్గాలు తొక్కేశారో.. ఇప్పుడు గంజాయి తరలింపుకు అటువంటి మార్గాలను అన్వేశిస్తున్నారు స్మగ్లర్లు. తాజాగా అల్లూరి జిల్లా(Alluri Sitharama Raju District)లో సినిమాను తలదన్నే రీతిలో కొత్త స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖరీదైన కార్ డోర్‌లలో గంజాయి ప్యాకెట్లు కుక్కి.. గుడ్డు చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేశారు. సరికొత్త స్టైల్ చూసి అధికారులకు ఖంగుతిన్నారు.
పాడేరు వద్ద తనిఖీలు చేస్తున్న SEB అధికారులకు.. తెల్లవారుజామున అనుమానాస్పదంగా రెండు కార్లు కనిపించాయి. వాటిని ఆపేందుకు ప్రయత్నం చేశారు అధికారులు. పారిపోతున్న ఆ రెండు వాహనాలను వెంబడించి పట్టుకున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఖరీదైన ఫోర్డ్, స్కార్పియో వాహనాలను ఆపి ప్రశ్నించే సరికి… పొంతన లేని సమాధానాలు చెప్పారు. వాహనాలు తనిఖీ చేసినా ఏమీ కనిపించలేదు. చివరి నిమిషంలో వదిలేద్దాం అనుకుని కూడా… అనుమానం వచ్చి కార్ల డోర్లపై దృష్టి పెట్టారు అధికారులు. ఓ చోట ఓపెన్ చేసి చూశారు. దీంతో ఆ కారు డోర్ లలో గంజాయి ప్యాకెట్స్ లభించాయి. రెండు కార్లతో పాటు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. కారు డోర్స్‌లో ఉన్న గంజాయిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఖరీదైన కార్లలో పర్యాటకుల మాదిరిగా వచ్చి.. కారు డోర్లలో గంజాయి పెట్టి నిఘా వర్గాలకు మస్కా కొట్టేందుకు ట్రై చేశారు స్మగ్లర్లు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కలిగిన ఫోర్డ్, స్కార్పియో వాహనాలు సీజ్ చేసిన SEB అధికారులు.. స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.
ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్