Andhra Pradesh PRC: ఏపీలో ముదుతున్న PRC పంచాయతీ.. మంత్రుల ప్రతిపాదనను తిరస్కరించిన ఉద్యోగ జేఏసీ!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె జరగడం ఖాయంగా కనిపిస్తోంది. చర్చలకు ఇప్పుడప్పుడే ముగింపు పడేటట్లు కనిపించడం లేదు. వాళ్లు వస్తేనే చర్చలంటోంది ప్రభుత్వం. మంత్రుల కమిటీ లేఖ ఇచ్చి పిలిస్తేనే చర్చలకు వెళ్తామంటున్నాయి ఉద్యోగ సంఘాలు.
Andhra Pradesh PRC Row: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల(Govt Employees) సమ్మె జరగడం ఖాయంగా కనిపిస్తోంది. పీఆర్‌సీ(PRC)పై చర్చలకు ఇప్పుడప్పుడే ముగింపు పడేటట్లు కనిపించడం లేదు. వాళ్లు వస్తేనే చర్చలంటోంది ప్రభుత్వం. మంత్రుల కమిటీ(Ministers Committee) లేఖ ఇచ్చి పిలిస్తేనే చర్చలకు వెళ్తామంటున్నాయి ఉద్యోగ సంఘాలు. చలో విజయవాడకు, సమ్మెకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొందరు ఉద్యోగులకు ప్రభుత్వం మెమోలు ఇస్తున్న వేళ న్యాయపరంగా పోరాడేందుకు ఇద్దరు సీనియర్ లాయర్లతో లీగల్ సెల్‌ను ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసుకున్నాయి.
ఏపీలో PRC పంచాయతీ ముదిరి పాకాన పడింది. ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు సిద్ధమని ప్రకటించిన ఉద్యోగ సంఘాలు అందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సమ్మె సైరన్ మోగించారు. 3వ తేదీన జరిగే చలో విజయవాడ సభ ఏర్పాట్లను పరిశీలించారు జేఏసీ నేతలు. ప్రభుత్వం పిలిచినా చర్చలకు రావడం లేదన్న విమర్శల నేపథ్యంలో PRC సాధన సమితి స్టీరింగ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు మంత్రుల కమిటీ లేఖ ఇచ్చి చర్చలకు ఆహ్వానిస్తేనే వెళ్లాలని నిర్ణయించారు.
మరోవైపు, జీతాలు ప్రోసెస్ చేయని ట్రెజరీ ఉద్యోగులకు చాలా చోట్ల అధికారులు మెమోలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఇద్దరు సీనియర్ లాయర్లతో లీగల్ సెల్ ఏర్పాటుకు నిర్ణయించింది స్టీరింగ్ కమిటీ. జీతాల అంశంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదని, వీలైతే IAS అధికారులపై ఢిల్లీకి వెళ్లి DOPTకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు జేఏసీ నేత సూర్యనారాయణ.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని, ఉద్యోగుల్ని బెదిరించే ధోరణిని మానుకోవాలని సూచించారు నేతలు. 3న చలో విజయవాడను సక్సెస్ చేసేలా లక్షలాది మంది ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఉద్యోగులు సమ్మె వరకు వెళ్లకుండా చూడాలని సీఎస్ సమీర్ శర్మ కలెక్టర్లు, HODలకు సూచించారు.