Pegasus Spyware Issue: టీడీపీ vs వైసీపీ.. ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేసిన పెగాసస్ వివాదం.. ఇంతకీ ఏది నిజం?

విమర్శలు. ప్రతి విమర్శలు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు. ఎత్తులకు పై ఎత్తులు. ఎవరికి వారే తగ్గేదే లే అన్న తీరు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మంటలు మండిస్తోంది.

Pegasus Spyware Issue: టీడీపీ vs వైసీపీ.. ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేసిన పెగాసస్ వివాదం.. ఇంతకీ ఏది నిజం?
YCP vs TDP
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 19, 2022 | 4:57 PM

Pegasus Spyware Issue: విమర్శలు. ప్రతి విమర్శలు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు. ఎత్తులకు పై ఎత్తులు. ఎవరికి వారే తగ్గేదే లే అన్న తీరు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మంటలు మండిస్తోంది. తాంబూలం ఇచ్చాను తన్నుకు చావండి అన్న చందంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెగాసస్ వ్యవహారాన్ని అగ్గి పెట్టి వదిలేయడమే ఇందుకు కారణం.  తప్పు మీరు చేశారంటే మీరంటూ ఎవరికి వారే మాటల తూటాలు పేలుస్తున్నారు. మా ఫోన్లు ట్యాప్ చేసి రహస్య సమాచారం తీసుకున్నారని ఒకరంటే.. మీరే ఆ పని చేస్తున్నారని మరొకరు అంటున్న తీరు హాట్ టాపికైంది.

సారా…రాజకీయం…

అసలే జంగారెడ్డిగూడెంలో సారా రాజకీయం తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాపుసారా ఖిల్లాగా జంగారెడ్డిగూడెం పరిసరాలు ఉన్నాయని విపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ వేదికగాను నిరసనలు చేశాయి. తొలిగా రూ.10 వేలు బాధితులుగా సాయంగా అందించిన టీడీపీ..ఆ తర్వాత ఆ మొత్తాన్ని లక్షకు పెంచింది. మృతుల కుటుంబీకుల్లో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇచ్చింది. బీజేపీ, జనసేనలు మేము సైతం అంటూ ముందుకు కదిలాయి. రూ.10 వేలు చొప్పున సాయం అందించాయి. మీ అంత కాకపోయినా గతం ఘనం ఇప్పుడు శూన్యంలా అంటున్న తీరులో కాంగ్రెస్ రూ.5000 వంతున సాయం ఇచ్చింది. ఇక కమ్యూనిస్టు పార్టీలు బాధిత కుటుంబాలను పరామర్శించి సాయపడతామని భరోసా ఇచ్చాయి. సహజ మరణాలను సారా మృతులంటున్నాయి విపక్షాలు. రాజకీయాల కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు మరోవైపు అధికార పార్టీ నేతలు. సిఎం జగన్మోహనరెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే ఈ మాటలు చెప్పడం రాజకీయ ఆసక్తిని పెంచింది.

సరైన టైమ్ లో…

ఇలాంటి సమయంలో పెగాసస్ స్పైవేర్ తేనెతుట్టెను కదిలించారు బెంగాల్ సిఎం మమత బెనర్జీ. అసెంబ్లీ వేదికగా దీదీ అన్న మాటలే ఇందుకు కారణం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారని మమత ఆరోపణ. మార్చి16, 2022 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వేదికగా మమత ఈ మాటలనడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. నాలుగు-ఐదేళ్ల క్రితం పెగాసస్ సాప్ట్ వేర్ ను రూ.25 కోట్లకు విక్రయిస్తామని దాని తయారీదారులు బెంగాల్ పోలీసులను సంప్రదించారు. తాను ఈ ప్రతిపాదనను తిరస్కరించాను అనేది మమత మాటల సారాంశం. అప్పుడు ఆ స్పైవేర్ ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మమత చెప్పడంతో విస్తుబోవడం బెంగాల్ సభ్యులే కాదు..ఏపీ నేతల వంతు అయింది. మార్చి 17, 2022న జరిగిన మీడియా సమావేశంలోను మరిన్ని వివరాలు తెలిపారు మమత. ప్రజల గోప్యతకు భంగం కలుగుతుందనే పెగాసస్ స్పైవేర్ ను తిరస్కరించినట్లు వెల్లడించారు మమతా బెనర్జీ. తన రాజకీయ ప్రయోజనాలకు కేంద్రం ఆ స్పైవేర్ ను ఉపయోగించదని మమత ఆరోపించడం వివాదాల అగ్గిని మరింతగా రాజేసింది. దేశ భద్రతకు స్పై వేర్ ఉపయోగించడానికి బదులు కేంద్రం దాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం అధికారులు, న్యాయమూర్తులపై ప్రయోగించిందనేది మమత మాటగా ఉంది. స్పైవేర్ తో వ్యక్తుల రహస్యాలు బహిర్గతం అవుతాయి. రహస్యంగా ఇతరుల వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారనేది విపక్షాలు చేస్తున్న ప్రధాన విమర్శ.

పెగాసస్ అంటే…

పెగాసస్ స్పైవేర్ తయారు చేసింది ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ పరికరాల ఉత్పత్తిదారు ఎన్‌ఎస్‌వో కంపెనీ. పెగాసస్‌ అనేది స్పైవేర్‌. ఫోన్‌ తో పాటు ఇతర డివైస్‌లోకి చొరబడే స్పైవేర్‌ ను ఆ కంపెనీ ఉత్పత్తి చేసింది. ఫోన్ లో ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత పెగాసిస్‌ కంట్రోల్‌లోకి ఫోన్‌ వెళుతోంది. ఫోనులో ఉన్న ప్రతి అంశాన్ని గమనిస్తుంది. డేటా విశ్లేషణ చేసి కావాల్సిన సమాచారం తీసుకుంటుంది. మాములు పోన్లే కాదు…యాపిల్‌ ఫోన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. వాయిస్‌ కాల్స్‌, వాట్సప్‌, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్‌, కాల్‌ లిస్ట్‌, కాంటాక్ట్‌ అన్ని ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. దేశ సౌర్వభౌమాధికారం, విదేశాంగ విధానం, లౌకిక విధానానికి దెబ్బ తగిలే ఎలాంటి పోన్ ట్యాంపింగ్ ను భారత ప్రభుత్వం అనుమతించదు. అలా చేసి ఉంటే కచ్చితంగా శిక్షార్హులే. ప్రభుత్వాలకు తప్ప ప్రైవేటుగా ఎవరికి తమ కంపెనీ సాప్ట్ వేర్ ను అమ్మకం చేయలేదని ఎన్ఎస్ వో కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అయినా వివాదాల అగ్గి చల్లబడలేదు.

2016లో తొలిసారిగా పెగాసస్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో వార్తల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. తాజాగా మమత వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వాడి వేడి రగులుతోంది. పెగాసస్ స్పై వేర్ తో ప్రత్యర్థులు, వీవీఐపీల ఫోన్లు హ్యాక్ చేసి వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి తదనుగుణంగా వ్యూహ రచన చేస్తున్నారనే వాదన లేకపోలేదు. ఆ వ్యక్తుల లోకేషన్ డేటా, వీడియో, ఫొటోలు, మెసేజ్ లు, మాటలు, కాంట్రాక్ట్ పేర్లు తెలుసుకునేందుకు ఇది దోహదం చేస్తోంది.

ఆఫర్ వచ్చింది నిజమే…కానీ..

మేము పెగాసస్ స్పైవేర్ కొనలేదని చెబుతోంది తెలుగుదేశం పార్టీ. మార్చి 17, 2022న ఆ పార్టీ అధికారిక ప్రకటన జారీ చేసింది. పెగాసస్‌ వార్తల్లో నిజం లేదు. చట్ట వ్యతిరేక పనులను అనుమతించం. స్పైవేర్‌ను వాడితే జగన్ అధికారంలోకే వచ్చేవారా అని ప్రశ్నించారు టీడీపీ నేతలు. మమతా బెనర్జీకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చు అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. మేము ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదు. అంతే కాదు అసలు విషయం చెప్పేశారు లోకేష్. మాకు కూడా ఈ స్పైవేర్ ను కొనమని ఆఫర్ వచ్చిందన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.

ఎదురుదాడి…

మేము అధికారంలో ఉన్నప్పుడు పోన్లు ట్యాంపింగ్ చేసింది నిజం కాదు. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు, కొందరు అధికారుల ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయంటున్నారు ఇంకోవైపు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ పార్టీ పరంగా ఈ సాఫ్ట్వేర్ వాడుతోందనేది ఆయన ఆరోపణగా ఉంది. మమతా బెనర్జీ తెలియక మాట్లాడి ఉంటారు. ఇదంతా ఎన్నికల వ్యూహం. పీకే ప్లానింగ్‌లా కనిపిస్తోందని చెప్పిన తీరు ఆసక్తికరమే. టీడీపీ స్పైవేర్‌ ను ప్రైవేటుగా కొనుగోలు చేసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని పై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఇంకోవైపు వైసీపీనేత అంబటి రాంబాబు. నిజం కాకపోతే మమతపై పరువు నష్టం దావా వేస్తారా అనేది ఆయన ప్రశ్నగా ఉంది. మా ఫోన్లు ట్యాప్‌ చేశారని ఎన్నికలకు ముందే చెప్పామని ప్రస్తావించారు అంబటి. ఫలితంగా ఇది వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధంగా మారింది.

అందుకే చర్యలన్న వైసీపీ…

ఏపీ మాజీ ఇంటెలిజిన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు కేసును ఇందుకు ఉదాహరణకు చూపుతోంది వైసీపీ. పెగాసస్‌ తరహాలో రాజకీయ నేతలు, ప్రతిపక్షాలపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన నిఘా పెట్టిందనేది ఆ పార్టీ ఆరోపణ. అప్పటి ఇంటెలిజెన్స్‌ ఛీప్‌ ఏబీ వెంకటేశ్వరావు ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం రూ.25.5 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో పాటు కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాల్లో వెల్లడైందని వైసీపీ సర్కార్ చెబుతోంది. అంతే కాదు వెంకటేశ్వర రావును సస్పెన్సన్ విధించింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వద్ద తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. విషయం ఏదైనా ఏబీ అభ్యర్థనను కేంద్ర హోం శాఖ తోసిపుచ్చింది. ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేయడం ఆ తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టుకు వెళ్లడం జరిగాయి.

పెగాసస్‌పై విచారణ

ప్రపంచంలోని 16 వార్తా సంస్థల పరిశోధన ఫలితంగా వెలుగులోకి వచ్చింది పెగాసస్ స్పైవేర్. అప్పటికే 50 వేలకు పైగా ఫోన్‌ నంబర్లు హ్యాక్‌ అయ్యాయని గుర్తు చేశాయి ఆ సంస్థలు. తొలిగా 1000 నంబర్లను గుర్తించగా..అందులో 50 దేశాలకు చెందిన వ్యక్తుల నంబర్లు ఉన్నాయి. వారిలో 189 మంది జర్నలిస్టులు, 600 మంది రాజకీయ నాయకులు, 65 మంది వ్యాపారవేత్తలు, 85 మంది మానవహక్కుల కార్యకర్తలు, 300 మంది భారతీయులు ఈ స్పైవేర్ బారిన పడ్డారని వారి పరిశోధనలో తేలింది. దేశ వ్యాప్తంగా దీని పై దుమారం రేగడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్‌ రవీంద్రన్‌ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ వేసింది. ముగ్గురు సభ్యుల కమిటీ దీని పై వాస్తవాలు తెలుసుకునే కసరత్తు చేస్తోంది.

ఏం చేయాలి…

పెగాసస్ వంటి సైబర్ దాడులను గుర్తించడమే అంత తేలిక కాదు. గుర్చించినా దాన్ని ఆపడం దాదాపు అసాధ్యమంటున్నారు సాంకేతిక నిపుణులు. మొబైల్ వినియోగదారులు చేయాల్సింది ఒక్కటే తమ సెక్యూరిటీ ప్యాచ్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. వివిధ యాప్ లను ఎక్కడ బడితే అక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవద్దు. గూగుల్ ప్లే స్టోర్ యాప్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ అప్లికేషన్లను అన్ ఇన్స్టాల్ చేసి బ్రౌజర్స్ ద్వారా మెయిల్స్, మెసేజెస్ చెక్ చేసుకోవాల్సిందే. ఇంకోవైపు నిజాలు నిగ్గు తేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలి. వాస్తవాలను ప్రజల ముందుంచాలి. మిగతా వారు వాటి బారిన పడకుండా సలహాలు, సూచనలు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. లేకపోతే స్పైవేర్ సంస్థల పై విచారణ జరపాలనే డిమాండ్లు మరికొన్ని ఏళ్ల పాటు కొనసాగే అవకాశముంది.

-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు

Also Read..

East Godavari: పవన్ తూర్పుగోదావరిలో ఎక్కడా పోటీ చేసినా ఓడిస్తా.. త్వరలోనే జనసైనికులు బాధపడే రోజు వస్తుంది: వైసీపీ ఎమ్మెల్యే

RRR Pre Release Event: పాన్‌ ఇండియా మూవీ ట్రిఫుల్‌ ఆర్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌.. లైవ్ వీడియో

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!