Andhra Politics: పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..

|

Mar 20, 2025 | 7:28 AM

మొన్న హెల్త్‌ యూనివర్సిటీ ..నిన్న కడప జిల్లా..తాజాగా విశాఖ క్రికెట్‌ స్టేడియం..ఇలా ప్రతిచోటా వైఎస్‌ఆర్‌ పేరును తొలగిస్తోంది..ఏపీ ప్రభుత్వం. అటు పథకాలకు..ఇటు కట్టడాలకు దివంగత సీఎం పేరు తొలగించడంపై మండిపడుతోంది..వైసీపీ. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది..ఆ పార్టీ.

Andhra Politics: పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..
Andhra Politics
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పేర్లమార్పు వివాదం మరోసారి రాజకీయరచ్చ రేపుతోంది. ఇటీవలే వైయస్‌ఆర్‌ జిల్లా పేరును వైయస్‌ఆర్‌ కడప జిల్లాగా..వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది..ఏపీ కేబినెట్‌. ఇప్పుడు తాజాగా విశాఖలోని డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులో..వైఎస్‌ఆర్‌ పేరు మాయమయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్‌ విగ్రహాన్ని తొలగించారని.. బాపట్లలో వైఎస్సార్‌ విగ్రహాన్ని తగలబెట్టారని ఆరోపిస్తున్నారు..వైసీపీ నేతలు. విశాఖలోని స్టేడియంకు వైఎస్‌ఆర్‌ పేరును తొలగించడాన్నినిరసిస్తూ నేడు స్టేడియం దగ్గర ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పార్టీ..

ఏపీలో అధికారం మారినప్పుడల్లా పేర్ల మార్పుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గతంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ హెల్త్‌ వర్సిటీగా మార్చింది. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును హెల్త్‌వర్సిటీకి పెట్టింది కూటమి ప్రభుత్వం. విశాఖ సీతకొండ హిల్‌వ్యూ పాయింట్‌ను గత వైసీపీ ప్రభుత్వం.. వైయస్‌ పేరు పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి అబ్దుల్ కలామ్‌ వ్యూ పాయింట్‌గా పేరు మార్చింది.

అప్పుడు.. ఇప్పుడు.. పేర్లుఇలా..

2019లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను మార్చేసింది జగన్ ప్రభుత్వం.. జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో పథకాలను అమలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌, వైఎస్‌ఆర్‌ పేర్లతో ఉన్న పథకాలకు కొత్త పేర్లు పెట్టింది. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా.. జగనన్న విద్యా కానుక పథకాన్ని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ అని పేరు పెట్టారు. అలాగే, జగనన్న గోరుముద్దను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్పు చేశారు. జగనన్న ఆణిముత్యాలును ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చింది ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్చారు. జగనన్న విద్యాదీవెన పథకం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా మార్చింది కొత్త ప్రభుత్వం. అలాగే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పేరు కాస్తా.. ఎన్టీఆర్‌ ఆరోగ్య భరోసాగా మారింది. రాష్ట్రంలో వైఎస్‌ పేరు కనిపిస్తే కూటమి పార్టీలకు భయం పుడుతోందని..అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని వైసీపీ మండిపడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..