Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు లేనివారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఏకంగా 4 లక్షల ఇళ్లు రెడీ.. అప్పటినుంచే మంజూరు..
ఏపీలోని పేదలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరు చేయడంపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే కొత్త ఇళ్లను కేటాయించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. పేదలు ఇళ్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడనుంది.

ఏపీలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథం కింద రాష్ట్రంలోని ప్రజలకు ఇళ్లు మంజూరు చేయడంపై కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద ఇళ్ల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు ఇంకా కేటాయించలేదు. దీంతో ఇళ్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇళ్ల మంజూరుపై కేంద్రం నుంచి క్లారిటీ వచ్చింది. వారం నుంచి 10 రోజుల్లో ఇళ్లను కేటాయించనుందని తెలుస్తోంది. రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి కేంద్రానికి పంపించింది. కేంద్రం మరోసారి పరిశీలన చేపట్టి ఇళ్లను మంజూరు చేయనుంది.
4 లక్షల ఇళ్లు మంజూరు
ఇప్పటికే పీఎం ఆవాస్ యోజన పథకం కింద 77 వేల ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పుడు మరో 4 లక్షల ఇళ్లకు ఆమోదం లభించింది. దీంతో వీటిని జిల్లాల వారీగా లబ్దిదారులకు కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు దాదాపు 9 లక్షల మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఇల్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో కేంద్రం 4 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు. త్వరలోనే అర్హులకు మంజూరు పత్రాలను అందించే అవకాశముంది. అటు పీఎం ఆవాస్ యోజన పట్టణ 1.0 పథకం కింద 19 లక్షల వరకు ఇళ్లు ఇప్పటివరకు రాష్ట్రానికి మంజూరు అవ్వగా.. ఇప్పటివరకు 3.71 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవ్వలేదు. ఇక 4 లక్షల ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత కొత్త ఇళ్ల మంజూరు కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలని సూచించింది.
పట్టణాల్లోని పేదల కోసం కొత్తగా పీఎం ఆవాస్ యోజన పట్టణ-1.0 పథకం కింద ఇల్లు మంజూరు చేయాలంటే ప్రస్తుతం ఉన్న ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇళ్ల మంజూరుకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. అటు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏపీలోని పేదలకు ఇళ్లను నిర్మించే పథకాన్ని కూటమి ప్రభుత్వం చేపడుతోంది. కాగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని 2029 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ ద్వారా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు రూ.1.50 లక్షల సాయం అందిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తుండగా.. మొత్తం రూ.2.50 లక్షల ఆర్ధిక సాయం పొందవచ్చు. ఇందుకోసం అవసరమైన ధృవపత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
