Andhra: కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అదేంటంటే
రేపు ఏపీలో పండుగ జరగబోతోంది. కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. బంపర్ విక్టరీతో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పండుగ చేసుకుంటోంది. కూటమి ఫెస్టివల్ వేళ మరో కీలకమైన హామీ అమలుకు సిద్ధమైంది ప్రభుత్వం. రేపటి కార్యక్రమానికి ఇదే హైలైట్. ఇంతకీ ఏంటా పథకం.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పిల్లల తల్లిదండ్రులకు తీయని కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. ఆ కబురు పేరే.. తల్లికి వందనం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం అమలుచేస్తోంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రేపు నిధులు జమకానున్నాయి. 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8 వేల 745 కోట్లు జమచేయనుంది ప్రభుత్వం. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి రేపటితో ఏడాది పూర్తి. ఈ సందర్భంగానే ఈ పథకాన్ని అమలుచేస్తోంది ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయం కోసం జూన్20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అమరావతి పనులు పరుగులు పెట్టాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. పలు కీలక సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. కేంద్రం సాకారంతో అనేక అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు వంటి హామీలను నెరవేర్చింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. డిజిటల్ పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించి.. అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏడాది వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భాగస్వాములు కానున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.