ఏపీలోని పేదలకు ప్రభుత్వం అదిరే శుభవార్త.. ఉచితంగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడంటే..?
ఏపీలో ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే పట్టాణ పంపిణీకి రెడీ అవుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ వివరాలు చూస్తే..

ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఉచితంగా ఇంటి స్థలాలు పంపిణీ చేయనుంది. ఇంటి స్థలం లేని పేదలకు వీటిని అందించేందుకు సమాయత్తం అవుతోంది. గ్రామాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం అందించనుండగా.. పట్టణాల్లోని పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం పంపిణీ చేయనుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ స్థలాల సేకరణకు కసరత్తు చేస్తోంది. దాదాపు 1,24,873 మంది కొత్తగా ఇంటి స్థలాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం భూమిని సేకరించనుంది. ఇందుకోసం 4800 ఎకరాల అవసరం అవుతాయని అధికారులు గుర్తించగా.. సేకరించిన అనంతరం రైతులకు ఇళ్ల పట్టాలు అందించనుంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెలలో అర్హుల తుది జాబితా
అయితే ఇళ్ల పట్టాలు లేని పేదలు ఉంటే.. వారి వివరాలను కూడా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం అర్హులను గుర్తించి తుది జాబితా రూపొందించనున్నారు. ఆన్ లైన్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇప్పటివరకు 4,59,050 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,43,496 మంది అర్హులుగా తేలారు. మిగతా 1,88,561 మందిని అనర్హులుగా తేల్చింది. అయితే మిగిలిన 1,26,694 దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సెంటు స్థలం ఇచ్చేందుకు భూమిని సేకరించగా.. అక్కడ ఇల్లు నిర్మించేందుకు చాలామంది ముందుకు రాలేదు. వారికి కూడా కొత్త పట్టాలు అందించనున్నారు. రాష్ట్రంలో ఇల్లులేని పేదలు 2.50 లక్షల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. 2.56 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉండగా.. వీటిల్లో తీసుకునేందుకు 18,623 మంది ముందుకొచ్చారు. మిగిలినవారికి ఇచ్చేందుకు 3,304 గ్రామాల్లో భూసేకరణ చేపట్టేందుకు అధికారులు రెడీ అయ్యారు. సగటున ఎకరాకు రూ.37.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నారు. అక్టోబర్ నాటికి అర్హుల తుది జాబితాను సిద్దం చేయాలని ప్రభుత్వ అధికారులు లక్ష్యం పెట్టుకోగా.. నవంబర్ నుంచి భూసేకరణ జరపనున్నారు. అనంతరం పట్టాలు అందించనున్నారు.
చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటి పట్టాలు త్వరగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన భూమిని సేకరించాలని ఆదేశించారు. దీంతో చంద్రబాబు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. పేదలకు ఇంటి పట్టాల పంపిణీకి రెడీ అయ్యారు. అయితే ఇంటి పట్టాల కోసం చాలామంది పేదలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రకన రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
