Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. రూ.30 వేల వరకు బెనిఫిట్.. వీరికి మాత్రమే..
చిరు వ్యాపారులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు లోన్ మేళా నిర్వహించనుంది. స్వనిధి పధకం ద్వారా రుణాలు అందించనుంది. దీని ద్వారా రూ.30 వేల వరకు రుణం పొందవచ్చు. వీటిని సొంత వ్యాపారం కోసం ఉఫయోగించుకోవాల్సి ఉంటుంది.

ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు తీపికబురు అందించింది. చిరు వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు అందించనుంది. ఈ మేరకు లోక కళ్యాణ పేరుతో మేళా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వనిథి పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ.30 వేల వరకు రుణం పొందవచ్చు. ఈ మేళాలో భాగంగా పండ్లు, కూరగాయలు, తోపుడు బళ్ల వ్యాపారం చేసుకునేవారికి బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులు అందిస్తారు. కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.30 వేల వరకు పొందవచ్చు. ఈ నిధులను తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు పట్టణాలతో కలిసి దాదాపు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులకు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది.
చిరు వ్యాపారులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వీళ్లు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో సిగ్నల్స్, ప్రధాన కూడళ్లు, మార్కెట్ల వద్ద తోపుడు బళ్లపై కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులను విక్రయిస్తుంటారు. వీరికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులను అందించనుంది. వీటిని కేవలం తమ వ్యాపారం కోసం మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అవసరాల కోసం వాడుకోకూడదు. దీంతో పాటు ఈ నెలాఖరుకల్లా 1,61,481 మంది చిరువ్యాపారులకు రూ.5 కోట్ల రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇక ఇప్పటివరకు రుణం పొందని వ్యాపారులను గుర్తించి అక్టోబర్ 1 నుంచి స్వనిధి పథకం ద్వారా క్రెడిట్ కార్డులు అందించనున్నారు. గతంలో ఈ పథకం ద్వారా విడతల వారీగా రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు అందించేవారు.
అయితే ఇప్పుడు నగదు సాయాన్ని ప్రభుత్వం పెంచింది. విడతల వారీగా రూ.15 వేలు, రూ.25 వేలు, రూ.50 వేలకు పెంచింది. రూ.30 వేల లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది దీని ద్వారా లబ్ది పొందారు. మరింతమంది ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో పాటు వీధి వ్యాపారులకు ఆహార భద్రత, శుభ్రతపై FSSAI సహకారంతో ట్రైనింగ్ కూడా ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అధిక వడ్డీల నుంచి చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ నిర్వహిస్తోంది. ఈ నెలాఖరు వరకు లోక కళ్యాణ మేళా జరగనుంది. ఈ మేళా ద్వారా చిరు వ్యాపారులు క్రెడిట్ కార్డులు పొందవచ్చు.
