AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇలా ఉన్నారేంట్రా.. అత్త అన్న ఒక్క మాటకు అల్లుడు ఎంత పని చేశాడంటే..?

కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చడంతో ఓ అల్లుడు అమానుషానికి ఒడిగట్టాడు. కోపంతో ఏకంగా అత్తారింటిపై డీజిల్ పోసి నిప్పంటించి సర్వనాశనం చేశాడు. ఇల్లు, విలువైన సామగ్రితో పాటు బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతైన ఈ షాకింగ్ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో తీవ్ర కలకలం రేపింది.

Telangana: ఇలా ఉన్నారేంట్రా.. అత్త అన్న ఒక్క మాటకు అల్లుడు ఎంత పని చేశాడంటే..?
Son In Law Burns Down Mother In Law House
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 14, 2026 | 10:09 AM

Share

కుటుంబ కలహాలు పతాక స్థాయికి చేరడంతో ఓ అల్లుడు విచక్షణ మరిచి ప్రవర్తించాడు. అత్తపై ఉన్న కోపాన్ని అమానుషంగా ప్రదర్శిస్తూ, ఇంటిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇల్లంతా కాలి బూడిదవ్వగా.. విలువైన సామగ్రి, బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడిహత్నూర్‌కు చెందిన కడమంచి రాజలక్ష్మీకి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆమె చిన్న కూతురును వస్తాద్ అరుణ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే కొంతకాలంగా అరుణ్ తరచూ అత్తారింటికి వచ్చి గొడవ పడుతుండేవాడు. ఈ నెల 8న అత్తారింటికి వచ్చిన అరుణ్, భార్యతో పాటు ఇంట్లో ఉన్నవారందరినీ చంపేస్తానని తీవ్రస్థాయిలో బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అల్లుడి బెదిరింపులకు భయాందోళనకు గురైన రాజలక్ష్మీ, తన చిన్న కుమార్తెను వెంటబెట్టుకుని హైదరాబాద్‌లో నివసిస్తున్న మరో కూతురు ఇంటికి వెళ్లిపోయారు.

అన్నంత పని చేసిన అల్లుడు

ఈ క్రమంలో ఈ నెల 9న అరుణ్ తన అత్తకు ఫోన్ చేసి, ఇంటిని ధ్వంసం చేస్తానని మరోసారి హెచ్చరించాడు. అల్లుడి వేధింపులు భరించలేక విసిగిపోయిన రాజలక్ష్మి.. “నీ ఇష్టం వచ్చింది చేసుకో” అంటూ ఫోన్ పెట్టేశారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న అరుణ్ అన్నంత పనీ చేశాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్‌లోని అత్తారింటికి వచ్చి, తాళం వేసి ఉన్న ఇళ్లుపై డీజిల్ పోసి నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు చెలరేగి ఇల్లు మొత్తం వ్యాపించాయి. స్థానికులు మంటలను గమనించి వెంటనే హైదరాబాద్‌లో ఉన్న రాజలక్ష్మికి సమాచారం అందించారు.

రూ. 2 లక్షల ఆస్తి నష్టం.. కేసు నమోదు

విషయం తెలుసుకున్న బాధితురాలు ఆదివారం ఉదయం గుడిహత్నూర్‌ చేరుకుని చూడగా.. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, బీరువా, కూలర్, వంట సామగ్రితో పాటు బీరువాలో దాచుకున్న అర తులం బంగారు పుస్తెల తాడు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు. అల్లుడే ఇంత దారుణానికి ఒడిగట్టాడంటూ బాధితురాలు స్థానికుల వద్ద వాపోవడం అక్కడున్న వారిని కలచివేసింది.

Follow Us