Power Holiday: ఏపీలో విద్యుత్ కోతలపై పొలిటికల్ మంటలు.. పవర్‌హాలీడేపై విపక్షాల విమర్శల బాణాలు
Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్‌హాలీడే ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అటు 6 నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతుండగా ఇప్పుడు పరిశ్రమలకు..
Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్‌హాలీడే ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అటు 6 నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతుండగా ఇప్పుడు పరిశ్రమలకు ( industries) పవర్ హాలీడే అమలు చేయడంతో విపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. ఇంతకీ విద్యుత్ డిమాండ్ అండ్ సప్లయ్‌పై ప్రభుత్వానికి ముందస్తు అంచనా లేదా ? రోజుకు 50 మిలియన్ యూనిట్ విద్యుత్ కొరత (Power Cuts)కు కారణాలేంటి ? ఏపీ (AP)లో శని, ఆదివారాల్లో పరిశ్రమలకు పవర్ హాలీడే (Power Holiday)అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే విద్యుత్ వినియోగంపై ప్రభుత్వానికి అంచనా లేదని అందుకే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బొగ్గు కొరత, కొనుగోలు ధర అధికం కావడం, వినియోగం పెరగడమే కారణమని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఇప్పుడు పరిశ్రమలకు మాత్రమే పరిమితమైన పవర్ హాలీడే ఆ తర్వాత ఇళ్లను కూడా టచ్ చేస్తుందా ? అనే భయం ఏపీ ప్రజల్లో పట్టి పీడిస్తోంది. ఏపీలో రోజువారీగా 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ ప్రస్తుతం అవసరం ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సౌర, పవన్ విద్యుత్ కేంద్రాల నుంచి 140 మిలియన్ యూనిట్ల విద్యుత్, కేంద్ర గ్రిడ్‌ల నుంచి 40 నుంచి 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. దీంతో ఇంకా 50 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. దీన్ని బహిరంగ మార్కెట్ నుంచి డిస్కమ్‌లు కొనుగోలు చేస్తున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు లేకపోవడం, బొగ్గును ఏరోజుకు ఆరోజే రవాణా చేయాల్సి రావడం, కొనుగోలు చేయాలన్నా మార్కెట్‌లో ఎక్కువ రేటు ఉండటంతో కెపాసిటీ కంటే తక్కువ విద్యుత్‌ను ప్రొడ్యూస్ చేయాల్సి వస్తోంది.
ఒకవేళ ప్రైవేట్ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలంటే పీక్, నాన్ పీక్ అవర్స్‌ను బట్టి రేటు ఉంటుంది. దీంతో యావరేజ్‌గా యూనిట్‌కు 12 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది ప్రభుత్వం. దీంతో లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు కనీసం 6 గంటల పాటు అనధికార కోత విధిస్తోంది ప్రభుత్వం. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. కరెంట్ కోతలతో వ్యవసాయ, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా రైతులు జనరేటర్ల కోసం పూర్తిగా డీజిల్‌పై ఆధారపడాల్సి వస్తోంది. పెట్టుబడి ఖర్చు భారీగా పెరగడంతో తీవ్ర నష్టాల బారిన పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, ఇప్పుడు 180 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే పరిశ్రలకు పవర్ హాలీడే వల్ల రోజుకు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆదా చేసిన విద్యుత్‌ను గృహ అవసరాలు, వ్యవసాయానికి ఉపయోగించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.
డిమాండ్ సరిపడా విద్యుత్ లేకపోవడం వల్లే పరిశ్రమలకు పవర్ హాలీడే అమలు చేస్తున్నామని SPDCL అధికారులు చెబుతున్నారు. 1696 పరిశ్రమల్లో వారాంతపు సెలవుకు మరొక రోజు పవర్ హాలీడే అమలు చేస్తున్నామంటున్నారు. 253 నిరంతర ప్రాసెసింగ్ పరిశ్రమల్లో రోజువారి విద్యుత్ వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల్లో విద్యుత్ వాడకాన్ని 50 శాతం మేరకు తగ్గించుకోవాలని ఆదేశించామని అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లో 50 శాతం మాత్రమే ఏసీలు వాడాలని ఆదేశించారు. అంతేకాదు వ్యాపార ప్రకటన హోర్డింగ్స్, సైన్ బోర్డులు సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు కరెంట్ వాడకూడదనే ఆంక్షలు విధించారు. రెండు వారాల పాటు విద్యుత్ కోతలు అమల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయం, గృహ అవసరాలకు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించాల్సి వచ్చిందన్నారు.
ఏప్రిల్ 1న 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగిందని, బయటి మార్కెట్ నుంచి 64 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందంటున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే విద్యుత్ డిమాండ్ మరింత పెరిగిందంటున్నారు అధికారులు. కొవిడ్ తర్వాత పరిశ్రమలు పుంజుకోవడంతో విద్యుత్ వినియోగం పెరిగిందంటున్నారు.
ఇవి కూడా చదవండి: