Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K Rosaiah Political Journey: కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు

K Rosaiah Death News: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. 88 ఏళ్ల రోశయ్యకు ఉదయం ఒక్కసారిగా బీపీ పడిపోయింది.

K Rosaiah Political Journey: కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు
Rosaiah
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 04, 2021 | 11:28 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. 88 ఏళ్ల రోశయ్యకు ఉదయం ఒక్కసారిగా బీపీ పడిపోయింది. దీంతో వెంటనే ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఆయన ఇంటి నుంచి స్టార్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.  బంజారాహిల్స్‌ స్టార్‌ ఆసుపత్రి నుంచి రోశయ్య నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న రోశయ్యను.. ఎన్నో పదవులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు.. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు చేపట్టారు.

1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు నిర్వర్తించారు. 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు.

1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మరోసారి శాసన మండలికి ఎంపికయ్యారు. వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనూ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

Also Read..

Konijeti Rosaiah: మాటల మాంత్రికుడు రోశయ్య.. అసెంబ్లీలో రాజకీయ ప్రత్యర్థులతో మాటల చెడుగుడు..