AP 10th Exams: అందుకే 10వ తరగతి పరీక్షలు వాయిదా.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్..
AP 10th Exams: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 10 వ తరగతి...
AP 10th Exams: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా పరిస్థితి చక్కబడిన తరువాత తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాదు.. త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరం అని మంత్రి ఉద్ఘాటించారు. విద్యార్థులు నష్ట పోకుండా ఉండాలనే పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందని మంత్రి ఉటంకించారు. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా తాము కోరామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. స్వీయ నియంత్రణతో కరోనా నుండి కాపాడుకోవచ్చునని అన్నారు. ఉపాధ్యాయులు కూడా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసిన మంత్రి.. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదన్నారు.
ఇదిలాఉండగా.. పరీక్షల నిర్వహణ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను వాస్తవంగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉందన్నారు. లోకేష్ ఏం సాధించాలని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు? అని మంత్రి ప్రశ్నించారు. పరీక్షలు రాయకపోతే కరోనా రాదని ఏమైనా గారంటీ ఉందా? అని నిలదీశారు.
కాగా, వాస్తవానికి పదో తరగతి పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటిదాకా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చినా.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తాజాగా పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రకటన వెల్లడించింది. ఇక టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో పది పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతానికి స్కూల్స్ తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also read: