Kalaara Celebrations at Ongole: ఒంగోలులో ఆరు కళారాల ఆనందోత్సవం.. వీక్షించేందుకు పోటెత్తిన భక్తులు

| Edited By: Srilakshmi C

Oct 24, 2023 | 10:47 AM

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభ మయ్యే కళారాల వెంట స్థానికులు కేరింతలు కొడుతూ బయల్దేరారు. వాద్యకారులు భీకర శబ్దాలతో హోరెత్తించారు. నృత్యాలు చేసేవారు, కాళికాంబ వేషధారణతో కోలాహలమంతా ఇక్కడే కొలువైంది. ఇలా ఊరేగింపుగా వస్తున్న అమ్మవారిని దర్శించి, కోబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు మహిళలు. అమ్మవారి రాక కోసం రాత్రంతా మేల్కొని మరీ ఎదురు చూశారు. రాత్రి బయలుదేరిన కళారాలు రాత్రంతా నగరమంతా..

Kalaara Celebrations at Ongole: ఒంగోలులో ఆరు కళారాల ఆనందోత్సవం.. వీక్షించేందుకు పోటెత్తిన భక్తులు
Kalaara Celebrations At Ongole
Follow us on

ఒంగోలు, అక్టోబర్‌ 24: దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణలు చూసేందుకు, అభిషేకాలు చేయించుకునేందుకు భక్తులు ఎంత ప్రాధాన్యత ఇస్తారో… ఒంగోలుకే ప్రత్యేకమైన కళారాల ఉత్సవాలు తిలకించేందుకు అంతకు రెట్టింపు ఆసక్తి కనబరుస్తారు. బయటి నగరాల నుంచి తరలివచ్చి మరీ కళారాలను దర్శించుకుంటారు. ప్రజలు దుర్గాష్టమి మహర్నవమి రోజుల్లో అర్ధరాత్రి పూట జరిగే ఈ వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. రెండవరోజు రాత్రి జరిగిన మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఊరేగింపుతో వచ్చిన 6 కళారాలు ఒక చోటికి చేరే అద్భుత ఘట్టాన్ని చూసి భక్తులు తరించారు.

ఒంగోలులో జరిగే దసరా ఉత్సవానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పట్లో కొన్ని గూడు బండ్లు కట్టుకుని అమ్మవారి కళారాన్ని ఊరేగిస్తూ, తప్పెట వాయిస్తు కాగడాలు పట్టుకుని అర్ధరాత్రి నుంచి ఊరు మొత్తం తిరిగే వారు. అలా తెల్లవారే వరకూ ఈ సందడి కొనసాగేది. రాత్రయినా సరే, తమ వీధిలోకి వస్తున్న కళారాన్ని చూసి అమ్మవారికి కాయ, కర్పూరమో సమర్పించి మొక్కులు చెల్లించుకునేవారు. ఇప్పుడు కాలంతో పాటు ఉత్సవ తీరులోనూ ఆధునికత చోటు చేసుకుంది. భక్తుల నమ్మకాన్ని పెంచుతూ అదిరిపోయే బాణ సంచా శబ్దాలతో ఆమ్మవారి కళారాలు వీధుల్లో ఊరేగించారు. కళారాన్ని దర్శించుకుంటే చాలు మళ్లీ ఏడాది వరకూ ఎలాంటి దుష్టశక్తులు దిరిచేరవు.. ఎలాంటి ఈతిబాధలు ఉండవని భక్తులు నమ్ముతారు.

ఆరు కళారాలు.. భక్తుల కొంగు బంగారాలు…

ఒంగోలులో మొత్తం ఆరు కళారాలు ఉన్నాయి. బాలాజీ రావు పేటలో కనకదుర్గాదేవి, గంటాపాలెం లో పార్వతి మాత, కొత్తపట్నం బస్టాండ్ వీధిలో నారాయణరావు స్కూలు వద్ద బాలా త్రిపుర సుందరీ దేవి, నరసింహ స్వామి, అంకమ్మ పాలెం లో కాళికా మాత, కేశవ స్వామి పేటలో మహిషాసుర మర్దిని కళారాలు ఉన్నాయి. వీనిలో నాలుగు కళారాలు పసుపు వర్ణంలో శోభిస్తుంటాయి. కాళికామాత ఎరుపు, నరసింహ స్వామి తెలుపు వర్ణంతో కళారాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఆనంద ఉత్సవం.. అద్భుత వీక్షణం

ఒంగోలులో దుర్గాష్టమి నాడు బాలాజీరావు పేట కనకదుర్గ, అంకమ్మపాలెం కాళికాదేవి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు నరసింహస్వామి వద్ద అమ్మవార్ల కళారాలు ఊరేగిస్తారు. మహర్నవమి రోజున గంటపాలెం పార్వతమ్మ, కేశవస్వామిపేట విజయదుర్గాదేవి, బివిఎస్ హాలు సెంటరులోని బాలాత్రిపుర సుందరి కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుష్ట సంహారంలో నర సింహ స్వామి అమ్మవారికి తోడుంటాడన్నది భక్తుల భావన.

అన్నీ ఒకచోట…

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభ మయ్యే కళారాల వెంట స్థానికులు కేరింతలు కొడుతూ బయల్దేరారు. వాద్యకారులు భీకర శబ్దాలతో హోరెత్తించారు. నృత్యాలు చేసేవారు, కాళికాంబ వేషధారణతో కోలాహలమంతా ఇక్కడే కొలువైంది. ఇలా ఊరేగింపుగా వస్తున్న అమ్మవారిని దర్శించి, కోబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు మహిళలు. అమ్మవారి రాక కోసం రాత్రంతా మేల్కొని మరీ ఎదురు చూశారు. రాత్రి బయలుదేరిన కళారాలు రాత్రంతా నగరమంతా ఊరేగి ఈరోజు ఉదయానికి అన్ని కళారాలు ట్రంక్ రోడ్డులోని మస్తాన్ దర్గా వద్దకు చేరుకున్నాయి. దీంతో ఆరు కళారాలను తీసుకొచ్చిన వివిధ దేవాలయాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ, ఈలలు వేస్తూ పరస్పరం స్వాగతించుకున్నారు. ఆ వైభవాన్ని చూడ్డానికి జనం వేలాదిగా గుమిగూడారు. దీనివల్ల ఏడాది పాటు దుష్టశక్తులు నగరానికి రాకుండా ఉంటాయనేది భక్తుల నమ్మకంగా ఉంది. ప్రతి యేటా దసరా ఉత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలులోనే జరిగే ఈ కళారాల ఉత్సవాలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.