- Telugu News Andhra Pradesh News Andhra Pradesh: Artist from Anakapalli district carved masterpiece of Goddess Durga Matha on tip of a pencil
Anakapalli: పెన్సిల్ మొనపై కొలువైన దుర్గమ్మ..! అబ్బురపరుస్తోన్న అనకాపల్లి కుర్రాడి అద్భుత ప్రతిభ
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ..! అమ్మ అనుగ్రహం లేనిదే సృష్టిలో ఏ కార్యం జరగదు. అంతటి మహిమాన్వితమైన అమ్మవారి పట్ల ప్రత్యేక భక్తిని చాటుకున్నాడు సూక్ష్మ కళాకారుడు. దసరా పర్వదినం సందర్భంగా అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. పెన్సిల్ మొన పై అమ్మవారి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగొల్లు గ్రామంలో వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా..
Maqdood Husain Khaja | Edited By: Srilakshmi C
Updated on: Oct 24, 2023 | 11:07 AM

అనకాపల్లి, అక్టోబర్ 24: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ..! అమ్మ అనుగ్రహం లేనిదే సృష్టిలో ఏ కార్యం జరగదు. అంతటి మహిమాన్వితమైన అమ్మవారి పట్ల ప్రత్యేక భక్తిని చాటుకున్నాడు సూక్ష్మ కళాకారుడు. దసరా పర్వదినం సందర్భంగా అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. పెన్సిల్ మొన పై అమ్మవారి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగొల్లు గ్రామంలో వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తున్నాడు. అనేక దేవతా మూర్తులు, మహానుభావుల విగ్రహాలు చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో చెక్కి జీవం పోస్తున్నాడు.

ప్రత్యేకమైన శిల్ప నైపుణ్యం, సూక్ష్మ కళాకారుడిగా ఖ్యాతి గడించాడు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ కళాఖండాల రూపొందించి అవార్డులు రివార్డులు రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్. తాజాగా దేవీ నవరాత్రులు, దసరా సందర్భంగా దుర్గమ్మ పై భక్తితో పెన్సిల్ మొన పై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు.

దాని పొడవు వెడల్పు గురించి తెలుసుకుంటే ఔరా అనక మానరు. వెడల్పు ఆరు మిల్లీమీటర్లు, ఎత్తు 16 మిల్లీమీటర్లు. 4బీ పెన్సిల్ మొనపై ఈ సూక్ష్మ కళాఖండం చెక్కడానికి నాలుగు గంటల సమయం పట్టిందని అంటున్నాడు వెంకటేష్. ముఖ్యంగా పెన్సిల్ మొనపై చెక్కిన అమ్మవారి స్వరూపం ఔరా అనిపిస్తుంది.

తదేకంగా చూస్తే గాని.. అమ్మవారి రూపం కనిపించేలా సాక్షాత్కరించాడు. దసరా సందర్భంగా భక్తులందరికి ఈ సూక్ష్మ దుర్గమ్మవారి విగ్రహం అంకితం చేసాడు వెంకటేష్. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాడు. ఈ సూక్ష్మ కళాఖండాన్ని చూసిన వారంతా వెంకటేష్ ప్రతిభను అభినందిస్తున్నారు.





























