Nara Bhuvaneswari Yatra: ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రతో పొలిటికల్ మైలేజీ పెరుగుతుందా..? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?
Nara Bhuvaneswari Yatra: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు తెలుగు రాష్ట్రాలతోపాటు.. జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అధికారపార్టీ వైసీపీ వర్సెస్ విపక్ష పార్టీల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ.. జనసేన పొత్తు.. ఆ తర్వాత ఉమ్మడి కార్యచరణ ప్రకటన.. మేనిఫెస్టోపై నిర్ణయం ఇలా అనేక రాజకీయ పరిణామాలకు వేగంగా అడుగులు పడ్డాయి.

Nara Bhuvaneswari Yatra: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు తెలుగు రాష్ట్రాలతోపాటు.. జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అధికారపార్టీ వైసీపీ వర్సెస్ విపక్ష పార్టీల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ.. జనసేన పొత్తు.. ఆ తర్వాత ఉమ్మడి కార్యచరణ ప్రకటన.. మేనిఫెస్టోపై నిర్ణయం ఇలా అనేక రాజకీయ పరిణామాలకు వేగంగా అడుగులు పడ్డాయి. అంతేకాకుండా.. 2024 ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రేపటి నుంచి (అక్టోబర్ 25) చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ముందుగా తిరుమల శ్రీవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన భువనేశ్వరి.. వెంట ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. భువనేశ్వరిని కలిసేందుకు తిరుమల స్థానికులు ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలయం వద్దకు రాకుండా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకోవడంతో.. వారితో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. నారావారిపల్లె నుంచి.. నిజం గెలవాలి బస్సుయాత్ర ప్రారంభమై.. రాయలసీమకు చేరుకోనుంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను రేపటి నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వాళ్లకు భరోసా ఇస్తారు. అంతే కాకుండా స్థానికంగా జరిగే పార్టీ సభలు, సమావేశాల్లోనూ నారా భువనేశ్వరి పాల్గొననున్నారు.
నిజం గెలవాలి బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇదే..
అయితే, నారా భువనేశ్వరి చంద్రబాబు సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా నారావారి పల్లె నుంచి ప్రారంభిస్తారు. అయితే, నారా భువనేశ్వరి యాత్ర కూడా నారావారి పల్లె నుంచే ప్రారంభం కానుంది. నారావారి పల్లె నుంచి మొదలై.. ఐతేపల్లి, నేండ్రగుంట, అగరాల మీదుగా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత నేండ్రగుంటలో మృతి చెందిన వారి ఇంటికి వెళ్లి భువనేశ్వరి పరామర్శించనున్నారు. అక్కడే ఎస్సీ కాలనీలో సహపంతి భోజనం చేస్తారు. అనంతరం చంద్రగిరి శివార్లలోని అగరాలలో తొలి బహిరంగ సభలో భువనేశ్వరి పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే, మహిళలతో పెద్దఎత్తున సభ నిర్వహించేందుకు టీడీపీ యంత్రాంగం కసరత్తులు మొదలుపెట్టింది. అయితే, మొదట రాయలసీమ జిల్లాల్లో ‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర కొనసాగనుంది. అయితే, బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం ఆయా ప్రాంతాల్లోని నేతలకు దిశానిర్దేశం చేసింది.
చంద్రబాబు అరెస్టు తర్వాత..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయి.. 46 రోజులైంది. సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయగా.. 10న ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర నుంచి.. రిమాండ్, పిటిషన్లు, విచారణ.. ఇలా అనేక పరిణామాలు.. ఉత్కంఠ రేపాయి. అయితే, చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఇప్పటికే.. 105 మంది చనిపోయినట్లు టీడీపీ చెబుతోంది. అందుకే.. కార్యకర్తల్లో భరోసా నింపేందుకు, ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి బస్సు యాత్రను చేపడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని.. అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నారా భువనేశ్వరి బస్సు యాత్ర.. తెలుగుదేశం పార్టీకి కలిసివస్తుందని పసుపు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..