AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దళిత యువకుడి హత్య కేసు రీ ఓపెన్‌… వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు

వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు బిగుస్తోంది. 2022లో పెద్ద దుమారం రేపిన డ్రైవర్ హత్య, డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసు మళ్లీ రీ ఓపెన్‌ అయింది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసుల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు ఒకటి. అప్పట్లో మృతదేహాన్ని డోర్ డెలివరీ...

Andhra Pradesh: దళిత యువకుడి హత్య కేసు రీ ఓపెన్‌... వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు
Ycp Mlc Anantababu Case
K Sammaiah
|

Updated on: Jul 23, 2025 | 7:01 AM

Share

వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు బిగుస్తోంది. 2022లో పెద్ద దుమారం రేపిన డ్రైవర్ హత్య, డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసు మళ్లీ రీ ఓపెన్‌ అయింది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసుల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు ఒకటి. అప్పట్లో మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు తదుపరి విచారణకు రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టును కోరగా.. న్యాయస్థానం ఈ మేరకు అనుమతి ఇచ్చింది.

2022లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి.. డెడ్‌ బాడీని డోర్‌ డెలివరీ చేసిన ఘటన అప్పుడు సంచలనం రేపింది. తానే ఈ హత్య చేసినట్లు అనంతబాబు ఇప్పటికే పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి రిమాండ్‌కు పంపారు. తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఈ కేసును క్లోజ్‌ చేయడానికి పోలీసులు కూడా సిద్ధమయ్యారు.

అయితే ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించింది. బాధిత కుటుంబానికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయ సలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. ఇప్పుడు తదుపరి విచారణకు రాజమహేంద్రవరం ఎస్సీ-ఎస్టీ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో మరింత లోతుగా కేసును దర్యాప్తు చేయనున్నారు.

ఎన్నికల సమయంలోనూ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసును.. కూటమి సర్కార్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం అనంతబాబు బెయిల్ పై బయటే ఉన్నారు. కోర్టు తాజా ఆదేశాలతో ఆయన్ను మరోసారి అరెస్టు చేసి విచారణ జరిపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అనంతబాబుతో పాటు మిగతా పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అన్నది తేల్చనున్నారు.