
ఏలూరు, ఆగస్టు 17: బోరు బావులు ఎందరో పసి పిల్లల ప్రాణాలు బలితీసుకున్నాయి. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఇప్పటికీ మనోవేదన అనుభవిస్తున్నారు. నీళ్లు కోసం తొవ్వి వదిలివేయడం తో ఆడుకుంటున్న చిన్నారులు బోరు బావుల్లో పడిపోతున్న సంఘటనలు ఆందోళనకరంగా మారాయి. అడుగుల లోతులో ఊపిరి ఆడక బాధిత చిన్నారులు అనుభవించే నరకం వర్ణనాతీతం. తమ బిడ్డ సజీవంగా బయటకు రావాలని ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన చెప్పలేనిది. బోరు బావుల్లో పడి ఎందరో పసి పిల్లలు ప్రాణాలు కొల్పుతున్నారు. అయితే నిరుపయోగంగా ఉన్న వీటిని పూడ్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఇవి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.
చిన్నారులు వీటిలో పడిన సందర్భంలో యంత్రాంగం ఎన్నో ప్రయత్నాలు చేసి వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. అయితే వీటిని పూడ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. కళ్లెదుటే ప్రమాదం జరిగే వరకు బోరు బావుల యజమానులు కళ్లు తెరవడం లేదు. చట్టాలు ఉన్నా నిర్లక్షం వల్ల తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బావులను పుడ్చకుండా వదిలేయడం ప్రమాదానికి కారణంగా కనిపిస్తుంది.
పొలాల దగ్గర, ఇళ్ళ దగ్గర నీటి కోసం బోర్లు వేయడం సాధారణం. కొన్ని బోర్లకు నీరు పడదు. ఇలా నీరు పడని బోరు బావిని వెంటనే పూడ్చి వేయాలి. అది కూడా సైంటిఫిక్ పద్దతిలో జరగాలి. అయితే నీరు పడదు అనే సంగతి తెలియగానే చాలా మంది బోర్లను పుడ్చకుండా వదిలేస్తున్నారు. దీంతో బోరు బావులు డేంజరెస్ గా మారుతున్నాయి. బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోతే కేసింగ్ తీసేసి వాటిని రాళ్లు, మట్టితో పూర్తిగా పూడ్చి వేయాలి. మొదట నీళ్లు పడకపోయినా తర్వాత వర్షాలు కురిసి నీళ్లు పడకపోతాయా అన్న ఆశతో చాలా మంది కేసింగ్ లు తీసేయడం లేదు. వాటిపై కవర్, రాళ్లు పెట్టీ ఉంచుతున్నారు. తర్వాత వాటి విషయం మర్చిపోతున్నారు. ఈ సమయంలో దొంగలు కేసింగ్ చోరీ చేసి గోతులు అలాగే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అలా వదిలేసిన గోతులే చివరకు చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. చాలా చోట్ల భూమి యజమానుల పిల్లలే ఆడుకుంటూ పూడ్చని బోరు బావుల దగ్గరకు వెళ్ళి అందులో పడి మృత్యువాత పడుతున్నారు.
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామం ప్రభుత్వ పాఠశాల దగ్గరలో బోరు బావి ఒకటి పహరి గోడ ఆనుకునే ఉంది. దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేశారు. బడి పిల్లలు అటువైపే ఎక్కువగా ఆడుకోవడానికి, టాయిలెట్స్ కి వెళ్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత అంటూ స్థానికులు వాపోతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి. ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు వెంటనే బోరుబావిని పూడ్చివేయాలంటూ స్థానికులు కోరుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.