రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీలో విచారణ… తదుపరి విచారణ జనవరి 18కి వాయిదా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్ పై ఎన్జీటీ లో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ ఇటీవలే స్టే ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్ పై ఎన్జీటీ లో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ ఇటీవలే స్టే ఇచ్చింది. అయితే ఎత్తిపోతల పథకం పనులు తిరిగి చేపడుతున్నారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేశారు. అందులో పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించాడు. దీనిపై ప్రభుత్వ వాదనలు వినిపించిన న్యాయవాది ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్జీటీకి తెలిపారు. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు మాత్రమే చేస్తున్నామని వివరించారు.
కాగా, వాదనలు విన్న అనంతరం ఎన్జీటీ పనులు జరగట్లేదన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా గత ట్రైబ్యునల్ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేశారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సమాధానంగా తాము సవాలు చేయలేదని, బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలకు అనుగుణంగానే వెళ్తామన్న ఏపీ తరపు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేస్తున్నట్లు ఎన్జీటీ ప్రకటించింది.