Andhra Pradesh: విధులకు డుమ్మా కొడితే ఇంటికే.. 43 మంది డాక్టర్లపై ఏపీ సర్కార్ కఠిన చర్యలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరతపై తరచూ విమర్శలు వస్తున్న వేళ విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ఏపీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. సంవత్సరాల తరబడి ఉద్యోగాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సేవలను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు వైద్యులపై చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా మరో 43 మంది వైద్యులను విధుల నుంచి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో పనిచేస్తూ అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను శాశ్వతంగా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. పలుమార్లు సంజాయిషీ నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాస్తవానికి సెకండరీ హెల్త్ పరిధిలో మొత్తం 118 మంది శాశ్వత వైద్యులు ఏడాదికి పైగా విధులకు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా గైర్హాజరవుతున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించే అవకాశం ఉండటంతో వారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యులపై డిస్మిసల్ ప్రక్రియ మొదలైంది.
ఇక చర్యలు ప్రారంభించిన తర్వాత మరో 34 మంది వైద్యులు రాజీనామాలు సమర్పించారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించే దిశగా అడుగులు వేస్తోంది. అభియోగాలు నమోదైన అనంతరం రాజీనామాలు చేసిన 19 మంది వైద్యుల విషయంలో మాత్రం శాఖాపరమైన విచారణ కొనసాగనుంది. ఇందుకోసం జిల్లాల వారీగా విచారణ అధికారులను కూడా నియమించారు. మరోవైపు కొందరు వైద్యులు వ్యక్తిగత కారణాల వల్ల విధులకు హాజరుకాలేకపోయామని వివరణ ఇవ్వగా.. ఆ వివరణలపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత తొమ్మిది మంది వైద్యులు తిరిగి విధుల్లో చేరారు. మరో 13 మంది అభ్యర్థనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని, అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
