రూ. 4 కోట్ల నగల చోరీ వెనుక క్రేజీ లవ్ స్టోరీ.. అసలు కథ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టిన ప్రేమికులను చూశాం.. కానీ పెళ్లి ఖర్చుల కోసం ఏకంగా రూ. 4 కోట్ల నగల దుకాణాన్నే ముంచేసిన ఈ ఘనుడి లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈజీ మనీ కోసం షార్ట్‌కట్ వెతికితే చివరికి మిగిలేది జైలు ఊచలేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయాలనుకున్నాడు.. ఆ పెళ్లిని కాస్త గ్రాండ్‌గా, లగ్జరీగా ప్లాన్ చేయాలనుకున్నాడు. కానీ, చేతిలో రూపాయి లేదు. దాంతో ఓ మైండ్ బ్లోయింగ్ సినిమా ప్లాన్ వేశాడు. ఏకంగా పని చేస్తున్న నగల దుకాణంలోనే రూ. 4 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను ఊడ్చేశాడు! ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగిన ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ప్లాన్ ప్రకారమే స్కెచ్.. నెలన్నర ముందే ఎంట్రీ!
ఈ సినిమా తరహా దోపిడీకి పాల్పడిన కిలాడీ దొంగ పేరు నితిన్ వర్మ. తన గర్ల్‌ఫ్రెండ్ కాజల్ వర్మతో ఎలాగైనా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనేది ఇతగాడి డ్రీమ్. అందుకోసమే గాజియాబాద్‌లోని ఒక ప్రముఖ గోల్డ్ షోరూమ్‌ను టార్గెట్ చేశాడు. పక్కా ప్లాన్‌తో నెలన్నర క్రితమే ఆ నగల దుకాణంలో ఉద్యోగిగా చేరాడు. స్టోర్ లోపల ఏముంది? సెక్యూరిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? అత్యంత విలువైన వజ్రాలు, రత్నాలు, బంగారు ఆభరణాలు ఎక్కడ దాస్తారు? అనే ప్రతి చిన్న విషయాన్ని చాలా గుప్తంగా గమనించాడు. ఎవరికీ కనీసం అనుమానం రాకుండా నమ్మకంగా నడుచుకున్నాడు.
మందు పార్టీ.. క్యాషియర్‌కు స్లో పాయిజన్ లాంటి ప్లాన్..!
జూన్ 12న అసలు కథ మొదలైంది. తనకు, కాజల్‌కు పెళ్లి ఫిక్స్ అయిందని నమ్మించి షోరూమ్ స్టాఫ్ మొత్తానికి గ్రాండ్ ‘లిక్కర్ పార్టీ’ (మందు పార్టీ) ఇచ్చాడు నితిన్. ఈ పార్టీకి నితిన్ తండ్రితో పాటు అతని ప్రియురాలు కాజల్ కూడా హాజరైంది. ప్లాన్ ప్రకారం.. షోరూమ్ తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజ్‌ను టార్గెట్ చేశారు. అతడితో బలవంతంగా ఎక్కువ మద్యం తాగించారు. పార్టీ ముగిసిన తర్వాత, పూర్తిగా మత్తులో ఉన్న క్యాషియర్‌ను ఇంటి దగ్గర దించుతానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఆ క్రమంలోనే అతడి జేబులో ఉన్న షోరూమ్ ఒరిజినల్ తాళాలను చాలా చాకచక్యంగా కొట్టేశాడు.
కేవలం 25 నిమిషాల్లో రూ. 4 కోట్లు మాయం!
మరుసటి రోజు తెల్లవారుజామున అసలు ఆపరేషన్ మొదలైంది. రాత్రి పూట కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు ఉదయం 7 గంటలకు తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయానికి నితిన్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై షోరూమ్‌కు చేరుకున్నాడు. దొంగిలించిన తాళాలతో చాలా కూల్‌గా షట్టర్ తెరిచి లోపలికి వెళ్లారు.
షోరూమ్‌లో కనీసం ఎలాంటి ‘యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్’ (Anti-theft alarm system) లేకపోవడం వాళ్లకు ప్లస్ పాయింట్ అయింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలో మొదటి అంతస్తులో ఉన్న బంగారం, వజ్రాలు, విలువైన నవరత్నాలు పొదిగిన రూ. 4 కోట్ల విలువైన నగలను బ్యాగుల్లో సర్దేసుకుని అక్కడ నుంచి చెక్కేశారు.
ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..!
ఉదయం షోరూమ్ తెరిచేసరికి జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గాజియాబాద్ పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు స్పీడప్ చేశారు. నితిన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, క్యాషియర్ తాళాలు పోవడం వంటి లింకులను కనెక్ట్ చేస్తూ కేవలం గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.
పోలీసుల ఇంటరాగేషన్‌లో నితిన్ నిజాలన్నీ కక్కేశాడు. తన ప్రియురాలితో అట్టహాసంగా పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత లగ్జరీగా సెటిల్ అవ్వడానికే ఈ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నితిన్ వర్మతో పాటు అతనికి సహకరించిన తండ్రిని, దొంగతనానికి ప్లాన్ గీసిన ప్రియురాలు కాజల్ వర్మను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి మెజారిటీ రికవరీ చేసినట్లు సమాచారం.
