YS Jagan: ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు..అర్జునుడు- జగన్
వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ‘సిద్ధం’ పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలతో సభాస్థలి నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు.

ఎన్నికల సమరానికి క్యాడర్‌ను సిద్ధం చేస్తూ.. సమరశంఖం పూరించారు వైఎస్ జగన్. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలా పోరాడుతున్న తనకు.. అండగా నిలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. భీమిలి వేదికగా జరిగిన సిద్ధం సభకు తరలివచ్చిన ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలకు..175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కర్తవ్యబోధ చేశారు.. వైసీపీ అధినేత. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నామని..ప్రభుత్వం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు. దేవుడి దయ..ప్రజల మద్దతు ఉన్నంత కాలం ఎవరికీ బెదరనని చెప్పుకొచ్చారు
ఓవైపు 56 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే.. టీడీపీ, జనసేన కూటమిపై విమర్శల బాణాలు సంధించారు..సీఎం జగన్. చంద్రబాబుకు ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేక..దత్తపుత్రుడితో పాటు ఇతరుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. : చంద్రబాబుకు 175 స్థానాల్లో పోటీకి అభ్యర్దులు కూడా లేరని జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వర్గాలే తనకు స్టార్ క్యాంపెయినరని చెప్పారు జగన్. కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా ఏ గ్రామానికి వెళ్లినా వైసీపీ ప్రభుత్వం, జగన్ మార్క్ పాలన కనిపిస్తుందని చెప్పారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా పథకాలు, పాలన అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీది వయసుతో పాటుగా మనసు, భవిష్యత్ ఉన్న పార్టీగా జగన్ పేర్కొన్నారు.
వచ్చే రెండు నెలలు రాష్ట్రంలో జరిగేది యుద్ధమేనన్నారు.. సీఎం జగన్. నేతలు, కార్యకర్తలు సైన్యంగా పని చేయాలని చెప్పారు. ఓవైపు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే.. సోషల్‌మీడియాలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్దేశించారు. మొత్తానికి మొదటి సిద్ధం సభతోనే క్యాడర్‌లో జోష్ పెంచారు వైసీపీ వైసీపీ అధినేత.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
