Palnadu district: గుడి పునర్నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా మరో అద్భుతం.. తన్మయానికి లోనైన భక్తులు
జ్ఞానవాపి మసీదులో శివలింగం గురించి నార్త్ టు సౌత్... నేషనల్ వైడ్ టాక్ షురూ అవుతోంది. అదే సందట్లో ఇటువైపు నుంచి ఏపీలో కూడా పురాతన శివలింగాలు బయటపడటంపై పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
AP News: పల్నాడు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రెంటచింతల మండలం(Rentachintala Mandal) మంచికల్లు(Manchikallu)లో పురాతన నాగమయ్య ఆలయం ఉంది. అయితే అది శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్థులు నిర్ణయించారు. తాజాగా అందుకు సంబంధించిన పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ శిథిలాలను తొలగిస్తున్నారు. దశబంధు కాలువకు, పంటపొలాలకు మధ్యనున్న ఆలయాన్ని శనివారం తొలగిస్తున్న సమయంలో 1876 నాటి శివలింగం, ఆ కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. ప్రధాన ఆలయంలో ఐదు అడుగుల లోతు మేర తవ్వకాలు జరిపారు. ఐదడుగుల లోతులో శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు ఆకాలం నాటి నాణేలు బయట పడ్డాయి. 150 ఏళ్ళ క్రితమే ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే శివలింగం చెక్కు చెదరలేదు. నాణేలు తుప్పు పట్టి ఉన్నాయి. గ్రామస్థులు భక్తిశ్రద్దలతో ఆ శివలింగానికి జలాలతో అభిషేకం చేసి.. పూజలు చేశారు. అప్పట్లో యజ్ఞయాగాదులు చేసి పూర్వికులు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటారని.. ఇది శక్తివంతమైనదని స్థానికులు భావిస్తున్నారు. శివలింగాన్ని, నాణేలను స్థానికంగా ఉన్న మరో ఆలయానికి తరలించారు. పురాతన శివలింగం బయటపడిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ లింగాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ఇటీవల పోలవరం వద్ద కూడా బయల్పడిన పురాతన శివలింగంపోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే అప్రోచ్ ఛానల్ కోసం జేసీబీలతో తవ్వకాలు జరుపుతుంటే భూగర్భం నుంచి ఇటీవల ఓ పురాతన శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. పురావస్తు శాఖ పరిశీలనలు జరిపి.. అది 12వ శతాబ్దానికి చెందిన శివలింగంగా తేల్చింది. చాళుక్యుల పాలనలో 800 ఏళ్ల కిందట గోదావరి తీరం వెంబడి అనేక శివాలయాలు నిర్మించారని.. వాటిలో ఇదీ ఒకటన్న అంచనాకు వచ్చారు.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9, తెలుగు, గుంటూరు.