ఎంతో ఇష్టంగా తిన్న సమోసాలే చిన్నారుల ప్రాణాలు తీశాయి.. అనకాపల్లి ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..
ఎంతో ఇష్టంగా తిన్న సమోసాలు... చిన్నారుల ప్రాణం తీశాయి. అనకాపల్లిలోని ఓ ఆశ్రమంలో జరిగిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఆశ్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో ఆశ్రమం నిర్వాహకుడుపై కేసు నమోదు చేసి ఆరెస్ట్ చేశారు. అసలు ఆశ్రమంలోకి ఆహారం ఎవరు తీసుకొచ్చారు అన్నదానిపై విచారణ జరుగుతోంది.
ఎంతో ఇష్టంగా తిన్న సమోసాలు… ముగ్గురు చిన్నారుల ప్రాణం తీశాయి. అనకాపల్లిలోని ఓ ఆశ్రమంలో జరిగిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఆశ్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో ఆశ్రమం నిర్వాహకుడుపై కేసు నమోదు చేసి ఆరెస్ట్ చేశారు. అనకాపల్లి కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో 27 మంది విద్యార్థులు డయేరియాతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. 17వ తేదీన సమోసాలు, చికెన్ బిర్యానీ తిన్నారు. ఓ కార్యక్రమంలో మిగిలిపోయిన పదార్థాలను తీసుకొచ్చి ఇవ్వడంతో.. అవి తిన్న కొంతసేపటికే వాంతులు, విరోచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.. డయేరియాతో పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించిన ఆశ్రమ నిర్వాహకులు తల్లిదండ్రులతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అందరికి చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు కొయ్యూరు మండలానికి చెందిన వాళ్లు. కోటవుట్ల మండలం కైలాసపట్నంలో అనాధల పాఠశాలలో చదువుతున్నారు ఈ విద్యార్థులు. ఈ ఘటనపై డిప్యూటీ డీఈవో విచారణ చేపట్టగా.. పరిస్థితిని ఆర్డీవో జయరాం పర్యవేక్షిస్తున్నారు.. మెరుగైన వైద్యం కోసం పలువురు విద్యార్థులను.. కేజీహెచ్‌కు తరలించామని కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
విద్యార్థుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యాశాఖమంత్రి లోకేష్‌తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు… ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
రూ.10 లక్షల పరిహారం.. నిర్వాహకుడు అరెస్ట్..
మరోవైపు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోమంత్రి అనిత… ప్రభుత్వం తరుఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫుడ్‌పాయిజన్ జరిగిన వెంటనే.. అధికారులకు సమాచారం ఇస్తే పరిస్థితి వేరేలా ఉండేదని.. హాస్టల్ నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి..తల్లిదండ్రులతో పిల్లలను పంపించారని హోంమంత్రి అనిత తెలిపారు. ఆశ్రమం నిర్వాహకుడు కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. అక్కడ హాస్టల్ ఉందని అధికారులకు కూడా తెలియదన్నారు. ఆరోజు సమోసాలు, బిర్యానీ, పునుగుల కూర తిన్నట్టుగుర్తించామని తెలిపారు. ఆహారం ఎలా వచ్చిందో విచారణ జరుపుతున్నామన్నారు. అమాయక గిరిజనులకు ఆశ్రయం కల్పిస్తామంటూ..నిర్వాహకులు వారిని నిర్లక్ష్యం చేశారన్నారు. నిబంధనకు విరుద్ధంగా నడిచే..ఇలాంటి ఆశ్రమాలపై విచారణ జరుపుతామని తెలిపారు.
మిగిలిన ఆహారం తీసుకొచ్చి ఇచ్చారు..
అనుమతిలేకుండా హాస్టల్ నడుపుతున్నారని.. అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ తెలిపారు. నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓ కార్యక్రమంలో మిగిలిన ఆహారం తీసుకొచ్చి..పిల్లలకు ఇవ్వడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
సమ్మెలో.. డాక్టర్ల సేవలు..
ఫుడ్‌పాయిజన్ బాధితులకు విశాఖ సీపీ బాగ్చీ పరామర్శించారు. సమ్మెలో ఉన్న జూడాలు కూడా..సేవలు అందించేందుకు రావడం అభినందనీయమని సీపీ తెలిపారు.
కాగా.. కలుషితాహారం తిని విద్యార్థులు చనిపోవటం ఏపీలో కలకలం రేపుతోంది. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతగా ఉందో లేదో చూసుకోకుండానే అందిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా కారణంగానే విద్యార్థుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.