AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్డి రాజుల రాజధానిలో మరుగున పడ్డ 14వ శతాబ్దపు ‘జడ్డిగాల బావి’.. పునర్నిర్మాణానికి పూనుకున్న పురావస్తు శాఖ..

Guntur District News: కొండవీడు కోట పైన జడ్పీ గెస్ట్ హౌస్‌గా పిలవబడే భవనానికి వెనుక ఉన్న ఎకరం స్థలాన్ని బాగు చేసి తోటగా అభివృద్ధి చేయటం, మేళ్లదిబ్బగా పిలవబడే రెండు ఎకరాల వైశాల్యాన్ని శుభ్రం చేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దటం. మూడు, మేళ్ల దిబ్బకు అనుసంధానంగా నిర్మించిన జడ్డిగాల బావిని పునర్ నిర్మించడానికి అటవీశాఖ కొండవీడు..

రెడ్డి రాజుల రాజధానిలో మరుగున పడ్డ 14వ శతాబ్దపు ‘జడ్డిగాల బావి’.. పునర్నిర్మాణానికి పూనుకున్న పురావస్తు శాఖ..
Kondaveedu Fort
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 27, 2023 | 8:15 PM

Share

గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 27: కొండవీడు రెడ్డి రాజుల రాజధాని. అత్యంత ఎత్తైన కొండలపై 14 శతాబ్దంలో నిర్మితమైన రాజధాని నగరం ఇది. ఇప్పటికీ ఎంతో మంది పర్యాటకులను ఈ రాజధాని ఆకట్టుకుంటుంది. ఇక ఇక్కడ పురాతన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. కొండవీడు రాజధానికి ఘాట్ రోడ్డు నిర్మాణం తర్వాత పర్యాటకుల రాక పెరిగింది. అదే విధంగా శిధిలావస్థకు చేరిన అనేక నిర్మాణాలను పురావస్తుశాఖ తిరిగి నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే కొండవీటి కోట నగరవనం అభివృద్ధిలో భాగంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. కొండవీడు కోట పైన జడ్పీ గెస్ట్ హౌస్‌గా పిలవబడే భవనానికి వెనుక ఉన్న ఎకరం స్థలాన్ని బాగు చేసి తోటగా అభివృద్ధి చేయటం, మేళ్లదిబ్బగా పిలవబడే రెండు ఎకరాల వైశాల్యాన్ని శుభ్రం చేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దటం. మూడు, మేళ్ల దిబ్బకు అనుసంధానంగా నిర్మించిన జడ్డిగాల బావిని పునర్ నిర్మించడానికి అటవీశాఖ కొండవీడు కోట అభివృద్ధి విజ్ఞప్తి మేరకు నిర్ణయించింది .

ప్రస్తుతం ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఘాట్ రోడ్డుకు కుడి భాగంలో రెండు ఎకరాలు వైశాల్యం కలిగిన భూభాగం ఉంది. దానిని స్థానికులు ‘మేళ్ల దిబ్బ’ అని పిలుస్తున్నారు. నేటి మేళ్ల దిబ్బే ఒకనాటి ‘గృహరాజ సౌధము’”. అసాధారణ నిర్మాణశైలి దీని సొంతం. ఈ  సౌధాన్ని ఒంటి స్తంభం మేడ అని కూడా పిలుస్తుంటారు. దీనిని తుమ్మ చెట్టు లాంటి ఒక తరహా చెట్టుతో నిర్మించారని చరిత్ర చెబుతుంది. దీన్ని ఒకే మొద్దు తోటి నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. రెడ్డి రాజులలో ‘కళావాన్’గా ప్రసిద్ధి చెందిన కుమారగిరి రెడ్డి దీన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు.ః

ఇవే కాక  కొండవీడులో ఎన్నో లీలా గృహాలు బంగారం, మణులతో నిర్మించిన, బ్రహ్మాండమైన భవంతినే గృహరాజ సౌధమని అంటున్నారు. ఈ సౌధంలో ‘ఆదిలక్ష్మి కామేశ్వరి’ అమ్మవారిని మూలస్థానంలో స్థాపించారు. ఆ పక్కనే నిర్మించిన బావినే జడ్డిగాల బావి అంటారు. దాని సమీపంలో మరో రెండు ఇలాంటి కోనేళ్లే నిర్మించారు. ఈ మూడింటిలోనూ జెడ్డిగాల బావే చాలా పెద్దది. దీని పొడవు సుమారు 100 అడుగులు, వెడల్పు 30 అడుగులు, లోతు 35 అడుగులు ఉంది. జడ్డిగాల బావి నాడు రాజ మందిరానికి, ఈ ఆలయానికి మంచినీటి సరఫరా చేసినట్లు తెలుస్తుంది.

ఆదిలక్ష్మి కామేశ్వరి అమ్మ వారి దేవాలయం కేవలం రాజ కుటుంబీకులు, రాజ పురుషులకు, అంతఃపుర కుల కాంతల పూజా కార్యక్రమాలకు ఉపయోగించేవారు. ఇంతటి విశిష్టత ఉన్న బావిని తిరిగి నిర్మించే కార్యక్రమం మొదలైందని కొండవీడు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ శివారెడ్డి తెలిపారు. కోటపై పునర్నిర్మాణంలో ఉన్న అన్ని కట్టడాలు పూర్తయితే రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.