ఇక ప్రజా పోరాటాలే: సీఎం జగన్ పాలనపై జనసేన బుక్ రిలీజ్

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు వారాల్లోనే వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. జగన్ వందరోజుల పాలనపై ఆయన పుస్తకాన్ని విడుదల చేస్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్ని కలవరపరిచే, ఆందోళన కలిగించే విధంగా విధాన నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు పవన్. వందరోజుల పాలనను జన విరుద్ధమైన జనరంజక పాలన అంటూ వపన్ అభివర్ణించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో జనరంజకంగా ఉన్నప్పటికీ వారి పాలన […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:20 pm, Sat, 14 September 19
ఇక ప్రజా పోరాటాలే:  సీఎం జగన్ పాలనపై  జనసేన  బుక్ రిలీజ్

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు వారాల్లోనే వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. జగన్ వందరోజుల పాలనపై ఆయన పుస్తకాన్ని విడుదల చేస్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్ని కలవరపరిచే, ఆందోళన కలిగించే విధంగా విధాన నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు పవన్. వందరోజుల పాలనను జన విరుద్ధమైన జనరంజక పాలన అంటూ వపన్ అభివర్ణించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో జనరంజకంగా ఉన్నప్పటికీ వారి పాలన మాత్రం జనవిరుద్ధంగా సాగుతుందని ఆరోపించారు.
గత ప్రభుత్వం కూలిపోడానికి ప్రధాన కారణాల్లో ఇసుక విధానం ఒకటని, ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే సామాన్యులకు ఇసుకను అందుబాటులో లేకుండా చేస్తోందని ఆరోపించారు. నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చినా అందులో చెప్పిన ధరకు, బయటకు వచ్చే సరికి అయ్యే ధరకు చాల వ్యత్యాసముందన్నారు. ఇసుక కొరతతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఆరోపించారు పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రూ.2లక్షల 58 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి వైసీపీ చెప్పిన నవరత్నాలు అమలుకోసం మరో రూ.50 వేల కోట్లు కావాల్సి ఉందని, ఈ భారీ నిధులు ఎక్కడినుంచి వస్తాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్. కేంద్ర ప్రభుత్వం , నిపుణులు చెబుతున్నప్పటికీ మొండిగా రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేస్తూ ప్రజల్లో అయోమయాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు భయపెడుతున్నారని, ఇలా చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు ఏమేరకు సాధ్యమో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవహారాలు సరిగ్గా లేవంటూ ఆరోపించారు. సీఎం జగన్‌పై గత ఏడాది జరిగిన దాడి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండర్లు, కృష్ణానది వరదలు, వంటి పలు అంశాలపై జనసేనాని తీవ్ర విమర్శలు చేశారు.

వచ్చే ఎన్నికలకు క్యాడర్‌ను తయారు చేయడంలో భాగంగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను రూపొందించారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే గ్రామస్దాయిలో ప్రభుత్వ సేవలు చేసే యంత్రాంగం ఉన్నప్పటికీ వాటిని నిర్వీర్యం చేయడానికే ఇలా వ్యవహరిస్తున్నారని, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కొరియర్ సర్వీస్‌గా అనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ఎలా చేసిందో ప్రస్తుతం ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కూడా అదేవిధంగా ఉందన్నారు పవన్. దీని వల్ల గ్రామీణ వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేపట్టి వైసీపీ వందరోజులు పూర్తయిన ఈ దశలో ఇకపై తాము ప్రజా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు జనసేనాని.