Andhra Pradesh: వంతెన కట్టండి బాబూ అంటే.. ఉన్నది కూడా పీకేశారు.. పోలీసుల చర్యపై ప్రజాగ్రహం..

సమస్య ఉందని విన్నవించుకుంటే ఎవరైనా సరే ఆ సమస్యను పరిష్కరిస్తారు. లేదంటే తాత్కాలిక ఉపశమన చర్యలైనా తీసుకుంటారు. ఇక్కడి అధికారులకు ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా..

Andhra Pradesh: వంతెన కట్టండి బాబూ అంటే.. ఉన్నది కూడా పీకేశారు.. పోలీసుల చర్యపై ప్రజాగ్రహం..
Andhra Pradesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 16, 2022 | 10:24 AM

సమస్య ఉందని విన్నవించుకుంటే ఎవరైనా సరే ఆ సమస్యను పరిష్కరిస్తారు. లేదంటే తాత్కాలిక ఉపశమన చర్యలైనా తీసుకుంటారు. ఇక్కడి అధికారులకు ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేది లేక వారే తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, అది కూడా ప్రమాదకరంగా ఉండటం, ప్రజల సమస్యను పరిష్కరించాలని మీడియా ప్రసారం చేయగా.. ఉన్న ప్రత్యామ్నాయాన్ని కూడా తొలగించారు అధికారులు. మీడియాలో వరుస కథనాలకు స్పందించారు అధికారులు. అయితే, ఉన్న వైరు బ్రిడ్జిని కూడా పీకేశారు పోలీసులు. దాంతో ప్రాణాలను పణంగా పెట్టి వాగులోనే నడుచుకుంటూ వెళ్తున్నారు గ్రామస్తులు. పిల్లలు స్కూలుకి వెళ్లాలంటే 8 కిలోమీటర్ల దూరం అదనంగా వెళ్లాల్సి ఉంటుంది. దాంతో.. వాగు దాటేందుకు గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు. వాగుపై వైరుతో వంతెన వేసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాలో ప్రసారం చేయగా.. స్థానికులు పోలీసులు వచ్చి ఆ వైర్ వంతెనను పీకేశారు. మరి కొత్తగా శాశ్వత వంతెన నిర్మిస్తారా? అంటే సమాధానమే లేదు. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు చెయ్యరు.. తాము చేస్తే ఇలా స్పందిస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు.

అల్లూరు జిల్లా, రంపచోడవరం మండలం, బందమామిడి గ్రామంలో ముప్పై నుంచి నలభై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరంతా కలసి ఒక నాలుగు వందల మంది వరకూ ఉంటారు. వీరు నిత్యావసరాలకు కావచ్చు.. స్కూలుకు కావచ్చు.. రోజూ రంపచోడవరం వెళ్లాలంటే.. చుట్టూ తిరిగి వెళ్లాలి. ఈ దూరం 8 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. వాగుపై ఒక వంతెన నిర్మించాలని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దాంతో గ్రామ ప్రజలే ఒక తీగ వంతెన నిర్మించుకున్నారు. ఇది ఒకే ఒక్కవైరు మీద నడవాల్సిన వంతెన. దీంతో తరచూ గాయాల పాలయ్యేవారు గ్రామస్తులు, విద్యార్ధులు. ఈ అంశంపై వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ9. దీనిపై స్పందించారు అధికారులు. కాకుంటే అది గ్రామస్తులను మరో మారు ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇక్కడ వాగు మీదుగా వంతెన కట్టాలన్నది గ్రామస్తుల డిమాండ్. కానీ ఈ డిమాండును పట్టించుకోకుండా.. మరింత కష్టాల్లోకి నెట్టేసింది పోలీసుల చర్య.

గత మూడేళ్లుగా ఈ వాగు గుండా నడచి వెళ్లలేక సొంతంగా తమకంటూ ఒక తీగ వంతెన కట్టుకున్నారు గ్రామస్తులు. ఈ తీగ మీదుగా వెళ్తుంటే.. ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయన్నది టీవీ9 ప్రసారం చేసిన కథనం. ఈ కథనాలతో అప్రమత్తమైన అధికారులు.. హుటాహుటిన వాగు దగ్గరకొచ్చి.. ఉన్న వైరు వంతెన కూడా పీకేసి. ఈ మార్గం ద్వారా మీరు వెళ్లడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు.

ఇవి కూడా చదవండి

వంతెన కట్టించాలి..

ఇక్కడ జరగాల్సింది ఇది కాదు. ఒక శాస్వత వంతెన కట్టించి ఇవ్వాలి. మొదట ఐటీడీఏ అధికారులను పిలవాలి. ఇరు పక్షాల వారు చర్చించి.. ఈ సమయంలోగా మీకు వంతెన నిర్మించి ఇస్తామన్న మాట ఇవ్వాలి. ఆ తర్వాత ఈ చర్యకు పాల్పడాలి. ఎలాంటి హామీ ఇవ్వకుండా.. ఐటీడీఏ అధికారులు రాకుండా.. స్థానిక పోలీసులు చేసిన ఈ చర్య ఎలా ఉందంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వీళ్లు చేసిన పని వల్ల.. రోజూ చిన్నారులు నిలువునా తడిసి బడికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వీరి చర్యపై ఇదేంటి అధికారులూ? అని నిలదీస్తున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..