Recharge Prices hike: న్యూ ఇయర్ వేళ షాకిచ్చే న్యూస్.. మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు..! ఏ రీఛార్జ్‌పై ఎంతంటే..?
కొత్త సంవత్సరంలో మొబైల్ వినియోగంపై చేసే ఖర్చు మరింత పెరగనుంది. సామాన్యులపై మరో బండ వేసేందుకు టెలికాం కంపెనీలు సిద్దమవుతున్నాయి. అదే రీఛార్జ్ ధరల పెంపు.. త్వరలోనే దీని గురించి ప్రకటన విడుదల కానుంది. ఏ రీఛార్జ్ ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..

మొబైల్ వినియోగదారులకు కొత్త ఏడాదిలో షాక్ తగలనుంది. రీచార్జ్ ధరలు ఊహించని స్థాయిలో పెరగనున్నాయి. ఏకంగా 16 నుంచి 20 శాతం వరకు టారిఫ్ ధరలు పెరగనున్నాయి. 2026 జనవరి ప్రారంభంలోనే పెంచేందుకు టెలికాం కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి. కొత్త ఏడాది స్టార్ట్ అవ్వగానే వెంటనే ప్రకటన చేసేందుకు సర్వం సిద్దం చేసుకున్నాయి. కొత్త సంవత్సరంలోకి హ్యాపీగా అడుగుపెట్టాలనుకుంటున్న ప్రజలకు ఇది చేదువార్తగానే చెప్పవచ్చు. దీని ప్రభావంతో మొబైల్ వినియోగదారులకు ఖర్చు మరింత పెరగనుంది. ఒక రీఛార్జ్‌పై ఏకంగా రూ.100 మేర పెంచనున్నారని తెలుస్తోంది.
రీఛార్జ్‌లపై పెంపు ఇలా..
ప్రస్తుతం ఎయిర్‌టెల్ 28 రోజుల వ్యాలిడిటీ గల బేసిక్ 5జీ ప్లాన్ రూ.319కు లభిస్తుంది. జనవరిలో ఈ ప్లాన్ ధర రూ.419 కానుంది. అంటే మీపై అదనంగా రూ.100ల భారం పడనుంది. ఇక జియో బేసిక్ రీచార్జ్ ప్లాన్ రూ.299కే ప్రస్తుతం అందుబాటులోకి ఉంది. దీని ధర కూడా రూ.359కు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇక రూ.349లుగా ఉన్న 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 5జీ ప్లాన్ రూ.429కి పెరగవచ్చు.
డేటా ప్లాన్ల ధరలు
ఇక డేటా ప్లాన్ల ధరలు కూడా అధికం కానున్నాయి. వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1జీబీ డేటాతో అందిస్తున్న ప్లాన్ ధర రూ.340గా ఉండగా.. త్వరలో ఇది రూ.419 కానుంది. ఇక 56 రోజుల వ్యవధిలో రోజువారీ 2జీబీ డేటా అందించే ప్లాన్ ధర రూ.579 నుంచి రూ.699కి చేరుకోనుంది.
త్వరలోనే షాక్
ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలన్నీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డేటా రీచార్జ్‌ల ధరలన్నీ పెంచనున్నాయి. 20 శాతం వరకు పెంచవచ్చని మార్కెట్‌ను రీసెర్చ్ చేసి అంచనా వేసేు మోర్గాన్ స్టాన్లీ సంస్థ తెలిపింది. 2026లో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెంచాలని టెలికాం కంపెనీలు నిర్ణయించాయని ,దీని వల్ల రీఛార్జ్ ధరలు పెంచనున్నాయని తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రతీ ఏటా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచుతున్నాయని, వచ్చే ఏడాది కూడా అదే జరగనుదని పేర్కొంది. అతి త్వరలోనే పెంపు చూడవచ్చని తెలిపింది.
