AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

All Set for Cockfights: కోడిపందాలపై నిషేధమున్నా.. బరిలోకి దిగిన పందెం కోడి.. కాయ్ రాజా కాయ్..

రాజభోగాలు అనుభవించిన పందెం కోడికి బరిలోకి దిగే రోజున ఉదయాన్నే స్నానం చేయిస్తారు. మద్దతుదారులు వెంటరాగా పందెం రాయుళ్లు బరికి చేరతారు. కోడిపుంజు బరువు, సైజును...

All Set for Cockfights: కోడిపందాలపై నిషేధమున్నా.. బరిలోకి దిగిన పందెం కోడి.. కాయ్ రాజా కాయ్..
Surya Kala
|

Updated on: Jan 14, 2021 | 11:48 AM

Share

All Set for Cockfights: సంక్రాంతి పండగ అంటే రంగుల రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, గొబ్బెమ్మలు, కొత్తఅల్లులు, పందెం కోళ్లు.. ముఖ్యంగా కోస్తా జిల్లాలతో కోడి పందాలు జోరుగా సాగుతాయి. కనుమ రోజున కోనసీమలో జరిగే ప్రభల తీర్ధం పిల్లలను, పెద్దలను ఎంత అలరిస్తుందో.. కోడి పందాలు…పందెం రాయుళ్లను అంతగానే అలరిస్తాయి. నేడు సంక్రాంతి పండగ సంబరాల్లో మూడో రాజు కనుమ.. ఈ పండగలో ప్రధానంగా పశువులు పూజలందుకుంటాయి. ఇక మరో వైపు పందెం కోళ్లు రెక్కలు విదిల్చాయి. కోస్తా జిల్లాల్లో కో అంటూ పోటీకి దిగాయి. సంక్రాంతి సంప్రదాయం జోరందుకుంది. పందెం రాయుళ్లు ఎప్పుడెప్పుడా అని ఏడాది నుంచి ఎదురుచూసిన సంబరం ఊపందుకుంది. సంక్రాంతికి సందడి తెచ్చే కోళ్లపందాల గురించి తెలుసుకుందాం..

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగకు అదనపు హంగులు అద్దేవి కోడిపుంజులే. వీటితో పాటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోనూ కోడిపందాల జోరు కొనసాగుతుంది. కోడిపందాలపై నిషేధమున్నా, పోలీసుల సోదాలు కొనసాగినా… సంప్రదాయ బద్ధంగా వస్తున్న కోడిపందాలు కొనసాగుతూనే ఉంటాయి. ఊరంతా పండుగ సంబరాల్లో మునిగితేలుతూ ఉంటె… పందెం రాయుళ్లు మాత్రం కోడిపందాల్లో మునిగితేలుతారు..

కోడి పందాలు జరిగేప్రాంతాల్లో హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. రకరకాల కార్లు, జీప్ లు, టూ వీలర్లతో ఆ ఏరియా అంతా సందడిగా ఉంటుంది. కోడి పందేల్లో డైరెక్టుగా పందెం కోడితో వచ్చి హడావుడి చేసేవారు కొందరైతే…. పై పందేలు కాసేవారు మరికొందరు. పందెం సొమ్ము భారీ మొత్తంలోనే ఉంటుంది. కోళ్లు బరిలో ఉండి పోరాటం చేస్తుంటే వేలు, లక్షలు లెక్కచేయకుండా పోటీలో పెడతారు. నగదుతోపాటు ఎకరాలకు ఎకరాలు భూమిని పందెం కాస్తారు. ఇలా ఎంతోమంది పంట భూములను కోల్పోతుంటే… గెలుపొందినవారు సంబరాలు చేసుకుంటారు. ఏటా దాదాపు 500 కోట్ల మేర పందాలు కాస్తున్నట్లు అంచనా. సాధారణ ప్రజలే కాదు.. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు ఈ పందాల్లో సందడి చేస్తారు.

పందెం రాయుళ్లకు కోడిపుంజులే పెట్టుబడి. అందుకే కుక్కుటశాస్త్రం అంటే కోళ్లకు సంబంధించిన శాస్త్రం ప్రకారం జాతి, రంగును బట్టి పందెం కోళ్లను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఆకారం, రంగు, చారలను బట్టి దాదాపు 20 రకాల కోళ్లు ఉన్నట్లు కుక్కుట శాస్త్రం చెబుతోంది. కాకి, డేగ, నెమలి, సేతువా లాంటి కోళ్ల రకాలయితే.. పందాల్లో తమను గెలిపిస్తాయని యజమానుల నమ్మకం. అందుకే పందెం రోజు వరకూ వాటిని మహరాజుల్లా మర్యాదలు చేస్తారు. బరిలోకి దిగే వరకూ కోడిపుంజును ఓ రేంజ్ లో పెంచి పోషిస్తారు.

వస్తాదులా తయారు చేయడానికి పందెం రాయుళ్లు పందెం కోళ్లకు ఇచ్చే మర్యాదా, వైభోగం ఓ లెవెల్లో ఉంటాయి. రెండు పుంజుల పెంపకం కోసం ప్రత్యేకంగా ఓ మనిషిని కేటాయిస్తారు. వాటి దినచర్య ఉదయాన్నే ఈతతో మొదలవుతుంది. ఎంత పోరాడినా అలిసిపోకుండా ఉండటానికి ఈ వ్యాయామం తప్పనిసరి. ఆ తర్వాత వేన్నీళ్లతో స్నానం చేయించి కోడిగుడ్డుతో ఫలహారం పెడతారు. చోళ్లు, గంట్లు, జొన్నలతో దాణా, మంచి పోషక విలువలు కలిగిన బాదం, పిస్తా, పాలు… చక్కని రుచికోసం కిస్ మిస్… ఇలా బాగా బలాన్నిచ్చే ఆహారం పెడతారు. మధ్యమధ్యలో వేటమాంసం అందిస్తారు. తవుడు, వెన్న, ఇతర చిరుతిళ్లూ… ఒక్కటేంటి… కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలన్నీ.. ఈ పందెం కోళ్లకు చేస్తారు. మరికొందరు మినరల్ వాటర్ కూడా వాడతారంటే పందెం కోళ్లను ఏ రేంజ్ లో చూస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతల మధ్య ఒక్కో కోడిపుంజును పెంచటానికి ఏడాదికి 25 వేల దాకా ఖర్చవుతుంది. మరికొందరు పందెం కోళ్లను పెంచి ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముతుంటారు.

రాజభోగాలు అనుభవించిన పందెం కోడికి బరిలోకి దిగే రోజున ఉదయాన్నే స్నానం చేయిస్తారు. మద్దతుదారులు వెంటరాగా పందెం రాయుళ్లు బరికి చేరతారు. కోడిపుంజు బరువు, సైజును బట్టి ఎవరి లెక్కల ప్రకారం వారు విజయావకాశాలపై అంచనాకు వస్తారు. పందెం ఎంతో నిర్ణయించుకుంటారు. వారి మాటకు మధ్యవర్తులే సాక్ష్యం. హోరాహోరీగా సాగే ఈ పందేలను చూడ్డానికి వేలాది మంది తరలివస్తారు. ఆ ప్రాంతమంతా అరుపులు కేకలతో రణరంగంగా మారిపోతుంది.

మరికొందరు పోరాడే పుంజు కాలికి కత్తి కడతారు. కత్తులు కట్టిన కోళ్లను బరి మధ్యకు తీసుకొస్తారు. ఒకదానిని ఒకటి మూడుసార్లు ముక్కులు రక్కించి, వాటి మధ్య ‘వైరాన్ని’ సృష్టిస్తారు. పందెపు బరి.. ఉత్సాహంతో, ఉత్కంఠతో ఊపిరి బిగబట్టుకుంటుంది. పావుగంట నుంచి గంట వరకూ ఈ హోరాహోరీ సాగుతుంది. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడ్డ పుంజు పోరాడి చనిపోవడమో, బరి నుంచి పారిపోవడమో జరిగేదాకా- పందెం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్రంలో ఒక్క సంక్రాంతికే 50 వేల కోడిపుంజులు ఈ పందాల్లో పాల్గొంటాయని అంచనా… సంక్రాంతి బరిలో ఢీ అంటే ఢీ అనేందుకు కోడిపుంజులు రెడీ అయ్యాయి.

Also Read: వ్యవ‘సాయానికి‘ కృతఙ్ఞతగా కనుమ పండుగ.. ఆ పర్వదినాన ప్రయాణం కూడదు.. కారణమేంటో తెలుసా?