AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలపై అడ్డాకులు.. భుజాలపై డోలీలు.. అడవి బిడ్డల వినూత్న నిరసన!

తరాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేళ అనకాపల్లి జిల్లా, అల్లూరి జిల్లాల సరిహద్దు గ్రామాల గిరిజన ఆడబిడ్డలు కుటుంబ సభ్యులతో కలిసి ఆవేదనతో ప్రదర్శన చేశారు. తలపై అడ్డాకులు పెట్టుకొని డోలిమోస్తూ నిరసన తెలిపారు. కొండలు గుట్టలు దాటుకుంటూ అయిదు కిలోమీటర్లు నడిచారు. తమ ఆవేదన వినండి మహాప్రభో అంటూ విన్నవించారు. పాలకులు అధికారుల తీరుపై ఆవేదన చెందుతూ.. తమ కష్టాలు తీరేదేన్నడు అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు ఆ అడవి బిడ్డలు.

తలపై అడ్డాకులు.. భుజాలపై డోలీలు.. అడవి బిడ్డల వినూత్న నిరసన!
Andhra News
Maqdood Husain Khaja
| Edited By: Anand T|

Updated on: Aug 11, 2025 | 1:23 AM

Share

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామాల్లో కోందు గిరిజనులు నివాసం ఉంటున్నారు. పితృగడ్డ, నేరెళ్ల బంధ, పెద్దగరువు, లోసింగి, కొత్త లోసింగితోపాటు.. అల్లూరి జిల్లా మూలపేట పంచాయితీ జాజుల బంద గ్రామాల్లో సుమారు 680 మందికి పైగా గిరిజనులు జీవనం సాగిస్తూ ఉన్నారు. వీరంతా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నారు. కనీస సౌకర్యాలు వీళ్లకు ఉండవు. విద్య వైద్యం మాట దేవుడు ఎరుగు.. తాగేందుకు కనీసం మంచినీరు సౌకర్యాలు కూడా లేవు. మహిళ గర్భం దాలిస్తే వాళ్ల భయం, బాధ వర్ణనాతీతం. అత్యవసరమైనా.. అనారోగ్యమైనా.. డోలి కట్టాల్సిందే. ఎందుకంటే ఆ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం ఉండదు. వాహనాలు వెళ్ళవు. అత్యవసరమైతే డోలి కట్టి కిలోమీటర్ల మేర కొండలు గుట్టలు రాళ్లు దాటుకుంటూ వెళ్లాల్సిందే. బిడ్డ కడుపులో పడి కాన్పు వరకు ప్రాణాలు ఉంటాయో లేవో అన్న ఆందోళనతో ఉంటారు ఇక్కడి ఆడబిడ్డలు, గిరిజనులు.

అధికారుల చుట్టూ తిరిగినా.. పాలకులను విన్నవించినా వారి కష్టాలు తీరడం లేదు. దీంతో ఇక చేసేది లేక ఆదివాసీ మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి నిరసన బాట పట్టారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా వినూత్నంగా నిరసన తెలిపి తమ ఆవేదన చెప్పే ప్రయత్నం చేశారు. తలపై అడ్డాకులు పెట్టుకొని డోలి కట్టి నడిచారు. రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలు దాటుకుంటూ సుమారు అయిదు కిలోమీటర్ల వరకు నిరసన ప్రదర్శన చేశారు. డోలి యాత్ర చేశారు. విద్యా వైద్యం తాగునీరు సౌకర్యం లేక అష్ట కష్టాలు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం లేక గర్భిణీల డోలిమోతలతో ప్రాణాలు ఉంటాయో లేదో అని ఆందోళన చెందారు. అలాగే నాన్ షెడ్యూల్ గ్రామాల్లో షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని.. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గిరిజనులుగా గుర్తించాలని కోరారు.

పిల్లలు చదువుకునేందుకు అంగన్వాడీ నిర్మించాలని, రోడ్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీరు, రోడ్డు, అంగన్వాడి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, స్కూలు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ గోడు విని తమ కష్టాలు తీర్చాలని కోరారు. ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు కాదు.. మాకు సమస్యలు పరిష్కారం చేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, పివీ టీజీ సంఘం కార్యదర్శి కామేశ్వరరావు, పితృగడ్డ గ్రామానికి చెందిన కొర్ర రాజు, వెంకటరావు, కొండబాబు, కిలో మహేష్, పెద్దగరువు గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.