AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి 14 రోజులు రిమాండ్! ఆ జైలుకు తరలించే అవకాశం

పోసాని కృష్ణమురళిని అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి 14 రోజులు రిమాండ్! ఆ జైలుకు తరలించే అవకాశం
Posani Krishna Murali
SN Pasha
|

Updated on: Feb 28, 2025 | 6:13 AM

Share

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. గురువారం అర్థరాత్రి 2.30 గంటల వరకు ఈ కేసుపై ఇరు పక్షాలు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిన్న రాత్రి 9.30కి రైల్వేకోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోసానిని ఓబులవారిపల్లి పోలీసులు హాజరుపర్చారు. ఐదు గంటల పాటు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. పోలీసుల తరపున పోలీసుల తరపు లాయర్లు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. పోసానిని 15 రోజులు జుడీషియల్ కస్టడీ ఇవ్వాలంటూ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచి మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఇక పోసాని తరపున కోర్టుకు దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. పోలీసుల తరపున కోర్టుకు ముగ్గురు లాయర్లు వచ్చారు. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు విషయంలో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు అంటున్నారు. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోసాని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. తాజాగా కోర్టు ఆయనకు మార్చి 13 వరకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.