AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగబోతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు మంత్రులు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, పలు ప్రభుత్వ నూతన పాలసీలు ప్రకటించనున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలో మార్పులతో పాటు పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి ఆమోద్రముద్ర వేయనుంది ఏపీ కేబినెట్‌. మరి.. పల్నాడు జిల్లాలోని సరస్వతి భూముల అంశంపై, పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై ఏపీ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?

Andhra Pradesh: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
Andhra Cabinet Meeting
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2024 | 7:20 AM

Share

ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా ఈ నెలాఖరుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగియనుండడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయనున్నట్లు నోటీఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అదే సమయంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌-1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై స్పెషల్‌ ఫోకస్‌ చేయబోతోంది ఏపీ మంత్రివర్గం. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణదారులపై కేసుల నమోదుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని.. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణలపైనే ఉండడం షాకిస్తోంది. ప్రస్తుత చ‌ట్టంతో భూఆక్రమణదారులపై చ‌ర్యల‌కు ఇబ్బందులు ఉన్నాయ‌ని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. దాని స్థానంలో కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే.. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం-1982ను రద్దు చేసి.. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు-2024ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. దానిపై కేబినెట్‌ భేటీలో చర్చించి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే.. లా అండ్‌ ఆర్డర్‌ను కూడా మరింత పటిష్టం చేసే ప్రతిపాదనలపైనా చర్చించనుంది ఏపీ కేబినెట్‌.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చ

మరోవైపు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపైనా కేబినెట్‌ సమావేశంలో చర్చ జరగనుంది. దానిలో భాగంగా.. వైసీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం-2019ని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయంచింది. దానికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77ను కూడా రద్దు చేసి.. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకాలకు ప్రాతిపదికగా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విజన్‌-2047, కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీకండక్టర్, డాటా సెంటర్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచే ప్రతిపాదనపై చర్చించనుంది. ఒలింపిక్‌ క్రీడల్లో బంగారు ప‌త‌కం సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని 7 కోట్లకు పెంచాలనే అంశంపై ఫోకస్‌ చేయనుంది. ఇక.. పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూ కేటాయింపులపై ఏపీ కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు పలువురు ఉన్నతాధికారులు, నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకాగా.. పోలవరం పనులు ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. అయితే.. కేబినెట్‌ సమావేశానికి ముందు పోలవరంపై చర్చించిన సీఎం చంద్రబాబు.. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అన్నది ఆసక్తి రేపుతోంది. అటు.. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. స్థానిక ప్రజల్ని భయపెట్టి భూములు లాక్కున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఏపీ కేబినెట్‌లో చర్చిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో సరస్వతి భూముల అంశం చర్చకు వస్తుందా?.. లేదా అన్నది కూడా సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది. మొత్తంగా.. పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌లో ఆమోద్ర ముద్ర పడబోతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..